మద్యం సేవించి విధులకు హాజరు… పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్
ఆన్లైన్ హాజరు లోపం… సిబ్బందికి షోకాజ్ నోటీసులు
“స్వర్ణ గ్రామ – స్వర్ణ వార్డ్” కార్యక్రమ డిప్యూటీ ఎంపీడీఓ పై చార్జెస్ ప్రేమ్
-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా


సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 07 :
జిల్లాలో ప్రభుత్వ సేవల అందజేతను మెరుగుపరచడం, కార్యాలయాల్లో క్రమశిక్షణను బలోపేతం చేయడం లక్ష్యంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మంగళవారం గోస్పాడు మండలం పసురపాడు గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సచివాలయంలో ప్రజలకు అందిస్తున్న సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు వివరాలు వంటి అంశాలను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. సేవల నాణ్యతపై అధికారులకు తగిన సూచనలు చేస్తూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలని ఆదేశించారు. తనిఖీ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ విజయ భాస్కర్ రెడ్డి మద్యం సేవించిన స్థితిలో విధులకు హాజరైనట్లు కలెక్టర్ గమనించారు. వెంటనే పోలీసుల సహాయంతో బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా, 100 మిల్లీలీటర్లకు 65 మిల్లీగ్రాముల ఆల్కహాల్ స్థాయి నమోదైనట్లు తేలింది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా ఉల్లంఘనగా పరిగణించి సంబంధిత సెక్రటరీపై తక్షణమే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా, సచివాలయంలో ఆన్లైన్ హాజరు నమోదు చేయని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే “స్వర్ణ గ్రామ – స్వర్ణ వార్డ్” కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ ఎంపీడీవోపై చార్జీలు ఫ్రేమ్ చేయాలని సూచించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణ, పారదర్శకత తప్పనిసరిగా పాటించాలని, ప్రజలకు సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
