
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 23 :
నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పై సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సంచలన దాడులు నిర్వహించారు. విజయవాడ, కర్నూలు నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు సమన్వయంతో కార్యాలయాన్ని చుట్టుముట్టి ఆకస్మికంగా సోదాలు చేపట్టాయి.
అక్రమ రిజిస్ట్రేషన్లు, భారీ స్థాయిలో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నాయన్న పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. భూముల కొనుగోలు, అమ్మకాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించి అవినీతి జరిగిందన్న ఆరోపణలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. సోదాల సమయంలో కార్యాలయంలోని కీలక రికార్డులు, పత్రాలు, కంప్యూటర్ డేటాను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని లోతుగా పరిశీలిస్తున్నారు. పలువురు సిబ్బందిని, సంబంధిత వ్యక్తులను ప్రశ్నిస్తూ లావాదేవీల వివరాలను ఆరా తీస్తున్నారు. దాడుల సమాచారం బయటకు రాగానే కార్యాలయం పరిసరాల్లో ఉన్న స్టాంప్ రైటర్లు, డాక్యుమెంట్ రైటర్లు హడావుడిగా షాపులు మూసివేసి వెళ్లిపోవడం కలకలం రేపింది. ఈ దాడులతో నంద్యాలలో రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్న అక్రమాలపై తీవ్ర చర్చ మొదలైంది. కీలక ఆధారాలు బయటపడే అవకాశం ఉన్నందున మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
