


సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 06 :
నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మంచినీటి పంపిణీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
మంత్రి ఫరూక్ రిబ్బన్ కట్ చేసి ఈ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, ఎండల తీవ్రత దృష్ట్యా మార్కెట్ యార్డ్‌కు వచ్చే రైతులు, కూలీలు మరియు సామాన్య ప్రజల దాహార్తిని తీర్చడానికి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చైర్మన్ గుంటుపల్లి హరిబాబును ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ వేసవి కాలం ముగిసే వరకు ఈ ఉచిత మంచినీటి సౌకర్యం నిరంతరాయంగా అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రంగ ప్రసాద్, మార్కెట్ యార్డ్ పాలక మండలి సభ్యులు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
