నంద్యాలలో జోరుగా సాగుతున్న జనసేన సభ్యత్వ నమోదు

 రాచమడుగు చందు–సుందర్ ఆధ్వర్యంలో ఇంటింటికీ ప్రచారం

ఎంఆర్ఓ, మున్సిపల్ కార్యాలయాల వద్ద ప్రత్యేక కేంద్రాలు ప్రారంభించిన నంద్యాల పార్లమెంట్ ఉద్యమి సభ్యత్వ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, జిల్లా అధ్యక్షుడు చింత సురేష్ బాబు

సభ్యత్వంతో రూ.5 లక్షల ప్రమాద బీమా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 09 :

నంద్యాల పట్టణంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. పట్టణంలోని పలు వార్డుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సభ్యత్వ నమోదు చేపడుతూ పార్టీ విస్తరణకు కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని రాచమడుగు చందు, సుందర్ సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నారు.

సోమవారం బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం సమీపంలో రాచమడుగు చందు, సుందర్ ఆధ్వర్యంలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని జనసేన పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను వివరించడంతో పాటు పెద్ద ఎత్తున సభ్యత్వాలను నమోదు చేశారు.  ఇక జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా నంద్యాల పట్టణంలోని ప్రధాన కూడళ్లైన ఎంఆర్ఓ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రత్యేక సభ్యత్వ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, వ్యవస్థలో మార్పు కోసం కృషి చేసే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువత, మహిళలు, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుని పార్టీ బలోపేతానికి సహకరించాలని కోరారు. సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.

నంద్యాల నియోజకవర్గంలో జనసేన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం ఈ నెల 26 నుంచి ప్రారంభమైందని పార్టీ నాయకులు తెలిపారు. నంద్యాల జిల్లా జనసేన పార్టీ పరిశీలకుడు కిలారి రోశయ్య, ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింత సురేష్ బాబు పర్యవేక్షణలో సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతోంది.

ఈ సందర్భంగా కిలారి రోశయ్య మాట్లాడుతూ కొత్త తరం యువతను నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ సభ్యత్వ రుసుమును రూ.400కు తగ్గించారని తెలిపారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించడం పార్టీ ముందుచూపుకు నిదర్శనమన్నారు. చింత సురేష్ బాబు మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ఎంపిక చేసిన నాయకులు, సాధక్‌లు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తారని తెలిపారు. జనసేన అభిమానులు, జనసైనికులు, యువత, వీర మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాచమడుగు చందు, సుందర్, రాంబాబు తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top