దేశ అభివృద్ధికి బలమైన పునాది – ఖచ్చితమైన జనగణన గణాంకాలు

పారదర్శకంగా, సమగ్రంగా డేటా సేకరణ చేయాలి

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 24:
దేశ అభివృద్ధి ప్రణాళికలకు జనగణన గణాంకాలు బలమైన పునాది వంటివని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని అయ్యలూరు మెట్టలో ఉన్న ఎస్విఆర్ ఇంజనీరింగ్ కాలేజిలో నిర్వహించిన జనగణన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ దేశ అభివృద్ధి ప్రణాళికలకు జనగణన గణాంకాలు బలమైన పునాది వంటివని ఖచ్చితమైన, సమగ్రమైన మరియు పారదర్శక సమాచార సేకరణ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు స్పష్టమైన దిశానిర్దేశం లభిస్తుందని తెలిపారు. జనగణన ప్రక్రియలో ప్రతి అధికారి అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని, ఇంటింటి సమాచారాన్ని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నమోదు చేయాలని ఆదేశించారు. సేకరించిన గణాంకాల ఆధారంగానే విద్య, వైద్యం, ఉపాధి, గృహనిర్మాణం మరియు మౌలిక వసతుల ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయని పేర్కొన్నారు. కాబట్టి ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా పని చేయాలని సూచించారు.

జనాభా గణన – ముఖ్య సూచనలు
●డూప్లికేషన్ నివారణ: ఒకే వ్యక్తి వివరాలు రెండుసార్లు నమోదు కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో చదువుకునే లేదా ఉద్యోగం చేసే వారి నమోదుపై స్పష్టత తీసుకోవాలి.
●ఒకే చోట నమోదు: వ్యక్తి ఎక్కడ నమోదు కావాలనుకుంటున్నారో నిర్ధారించుకుని, ఒకే చోట నమోదు చేయాలి.
●సంస్థాగత గణన: హాస్టళ్లు, ఆశ్రమాలు, ఎన్‌జీఓలు నిర్వహించే వసతి గృహాలలో నివసించే వారిని ‘ఇన్స్టిట్యూషన్’ కింద పరిగణించి నమోదు చేయాలి.
●శిక్షణ ప్రాముఖ్యత: ఎన్నికల శిక్షణకు ఇచ్చే ప్రాధాన్యతతోనే సెన్సస్ శిక్షణను కూడా తీసుకోవాలని, శిక్షణలో నేర్చుకున్న అంశాలను కిందిస్థాయి సిబ్బందికి సమగ్రంగా వివరించాలని సూచించారు.
●అధికారుల సహకారం: సిపిఓ, స్టాటిస్టికల్ అధికారులు మరియు ఛార్జ్ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.
●గౌరవ వేతనం: విధులు పూర్తి చేసిన అనంతరం నిబంధనల ప్రకారం సిబ్బందికి, ఛార్జ్ అధికారులకు గౌరవ వేతనం మరియు ఇతర ఖర్చులు చెల్లించబడతాయని వెల్లడించారు.
●ఖచ్చితమైన డేటా లక్ష్యం: జిల్లాకు సంబంధించిన ‘ప్యూర్ డేటా’ సేకరణే ప్రధాన లక్ష్యమని, పర్ఫెక్షన్‌తో పని చేయాలని నొక్కి చెప్పారు.

ప్రశ్నావళి మరియు సేకరించాల్సిన వివరాలు:
ఈ జనాభా గణనలో మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయని తెలిపారు. వీటి ద్వారా సేకరించిన సమాచారం ప్రభుత్వ విధానాల రూపకల్పనకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
●నివాస గృహం కచ్చా లేదా పక్కా ఇల్లు అన్నది నమోదు చేయాలి.
●త్రాగునీటి వనరులు, టాయిలెట్ సౌకర్యం, గ్యాస్ కనెక్షన్ వంటి వివరాలు నమోదు చేయాలి.
●కుటుంబాల సామాజిక, ఆర్థిక స్థితిగతులు మరియు మౌలిక వసతుల లభ్యతపై సమాచారం సేకరించాలి.
●కులం వివరాలు నమోదు చేసేటప్పుడు వారు చెప్పినదే నమోదు చేయాలి; ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్యుమెంట్లు అడగరాదు.
●డ్రాప్‌డౌన్ జాబితాలో లేని కులాలైతే ‘ఇతర కులాలు’ కింద నమోదు చేయాలి.

కీలక మార్గదర్శకాలు:
●ప్రతి ఇంటికి వెళ్లి పూర్తి వివరాలు సేకరించాలి.
●ప్రశ్నావళిపై ప్రజలకు స్పష్టతనిచ్చి సమాధానాలు పొందాలి.
●ప్రభుత్వం నిర్దేశించిన ఫార్మాట్‌లలోనే సమాచారం నమోదు చేయాలి.
●స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ డేటా సేకరణ జరగాలి.
●వ్యక్తిగత వివరాల గోప్యతను కాపాడాలి.
●నిర్ణీత గడువులోపు గణన ప్రక్రియ పూర్తి చేయాలి.

ప్రత్యేక సూచనలు:
●ప్రతి 1000 మంది జనాభాను ఒక యూనిట్‌గా పరిగణించి సుమారు నాలుగు బ్లాకులుగా విభజించి గణన నిర్వహించాలి.
●చెంచు పెంటలు, దూర ప్రాంత నివాసాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
●గ్రామ పరిధి స్పష్టతతో నివాసాల గుర్తింపు జరపాలి.
●జనాభా, భౌగోళిక విస్తీర్ణాన్ని బట్టి తగిన సంఖ్యలో ఎన్యుమరేటర్లను నియమించాలి.
●ఏ ఒక్క వ్యక్తి గణనకు దూరం కాకుండా సమగ్రతతో పని చేయాలి.

శిక్షణ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ & చీఫ్ ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్ డా. జగన్నాథ్ మజ్హి, డిప్యూటీ డైరెక్టర్ & డిప్యూటీ చీఫ్ ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్ దిబ్బకర్ బరిహ, జిల్లా ఇన్చార్జి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ జి. విష్ణుమాధురి, డైరెక్టరేట్ శిక్షకులు మోహన్ రమణ, అమిత్ సింగ్, దీపక్ భరద్వాజ్, డిఆర్ఓ రామునాయక్, నంద్యాల, డోన్, ఆత్మకూరు ఆర్డీఓలు, అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Scroll to Top