
సత్యం వార్త / నంద్యాల / మార్చి 14 :
నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ సర్కిల్ వద్ద శనివారం వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు జి.లక్ష్మీదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, జిల్లా నాయకుడు మురళీధర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్యాస్ ధరల పెంపుతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. మార్కెట్‌లో గ్యాస్ కృత్రిమ కొరతను నివారించి ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొన్ని గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నాయని, దీనిపై అధికార యంత్రాంగం నిఘా ఉంచాలని కోరారు.
ధరలు తగ్గించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న, ఎఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాముడు, మహిళా సమాఖ్య పట్టణ కన్వీనర్ సుశీలమ్మ, ఎఐటీయూసీ పట్టణ అధ్యక్షుడు భూమని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
