గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి దర్శనం కు మార్గం సుగమం….మంత్రి ఫరూక్ విజ్ఞప్తితో స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

రెండు రోజులు అటవీ మార్గంలో రాకపోకలకు అనుమతి

డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఫరూక్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 14 :

నంద్యాల- మార్కాపురం జిల్లా సరిహద్దులో ఉన్న నాగార్జునసాగర్- శ్రీశైలం పులుల అభయారణ్యంలో  ఉన్న శ్రీ గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి  ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా  భక్తులు వెళ్లేందుకు మార్గం సుగుమం అయింది. రెండు జిల్లాల సరిహద్దులో ఉన్న గుండ్లబ్రహ్మేశ్వర క్షేత్రానికి దశాబ్దాల కాలం నుంచి ఎంతో పురాతనమైన ప్రాశస్యత నేపథ్యం  ఉంది.  అశ్వత్థామ మహర్షి చేత ప్రతిష్టించబడిన స్వయంభూ శివలింగ క్షేత్రంగా గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి క్షేత్రానికి ఎంతో విశిష్టమైన ప్రాధాన్యత, పురాతన నేపథ్యం ఉంది. ఏడాదిలో కేవలం శివరాత్రి పర్వదినాల్లో, రెండు రోజులు మాత్రమే భక్తుల సందర్శనార్థం మాత్రమే భక్తుల రాకపోకలకు అటవీ శాఖ షరతులతో కూడిన  రాకపోకలకు అనుమతి ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఏడాది పులుల లెక్కింపు కారణంగా అటవీశాఖ  రాకపోకలకు అనుమతులు ఇవ్వలేదు.

గుండ్ల బ్రహ్మేశ్వరం కు నాలుగు మార్గాలు :

దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన గుండ్ల బ్రహ్మేశ్వరం క్షేత్రానికి చేరుకునే మార్గాలు ఇవే.

1.నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామం అక్కడి నుంచి ట్రాక్టర్ల సాయంతో కొండ మొక్క అనే ప్రదేశం వరకు స్థానికులు చేరవేస్తారు.అక్కడి నుంచి పది కిలోమీటర్లు నడిస్తే క్షేత్రం చేరుకోవచ్చు.

2. బండి ఆత్మకూరు మండలం నారాయణపురం నుంచి మొత్తం 22 కిలోమీటర్లు ఉంటుంది.

3.నంద్యాల- గిద్దలూరు మార్గంలో  దిగువమెట్ట నుంచి జీపులు, ట్రాక్టర్లు కాలినడకన 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే గుండ్ల పరమేశ్వరం చేరవచ్చు.

4.మార్కాపురం జిల్లా గిద్దలూరు తాలూకా అర్ధవీడు మండలం పాపినేని పల్లె గ్రామం నుంచి వాహనాల్లో కాలినడకన సుమారు 25 కిలోమీటర్ల ప్రయాణించి గుండ్ల బ్రహ్మేశ్వరం చేరవచ్చు.

పులుల లెక్కింపు ప్రక్రియతో నెలకొన్న సందిగ్ధత  :

నాగార్జునసాగర్- శ్రీశైలం పులుల అభయారణ్యం (ఎన్. ఎస్. ఆర్. టి) లో గుండ్ల బ్రహ్మేశ్వరం ఆలయానికి   మహా శివరాత్రి మినహా మిగతా రోజుల్లో మనుషులు,  వాహనాల రాకపోకలకు  అనుమతించరు. పులులతో పాటు ఇతర అరుదైన జంతు, పశుపక్షాదుల సంరక్షణకు  ఆటంకం ఏర్పడకుండా అటవీశాఖ కట్టుదిట్టమైన చర్యలు అమలు చేయడం జరుగుతున్నది. ఈ కారణంగానే ప్రతి సంవత్సరం కేవలం మహాశివరాత్రి  పర్వదినం సందర్భంగా రెండు రోజులపాటు  భక్తుల రాకపోకలకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడం జరుగుతోంది. అయితే ఈ ఏడాది పులుల లెక్కింపు ప్రక్రియ కారణంగా  కారణంగా గుండ్ల బ్రహ్మేశ్వరం కు  భక్తులకు అనుమతి ఇవ్వడంపై  సందిగ్ధత ఏర్పడింది…

మంత్రి ఫరూక్ విజ్ఞప్తితో  స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

మహాశివరాత్రి సందర్భంగా నంద్యాల- మార్కాపురం జిల్లా సరిహద్దు  నాగార్జునసాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వు అటవీ ప్రాంతంలో ఉన్న గుండ్ల బ్రహ్మేశ్వరం (జి బి యం)  ఆలయ సందర్శనకు రెండు రోజులు అనుమతి లభించింది.పులుల లెక్కింపు ప్రక్రియ కారణంగా  భక్తుల సందర్శనకు  మొదట  అటవీశాఖ అనుమతులు ఇవ్వలేదు. ఈ విషయంపై  శివరాత్రికి క్రమం తప్పకుండా గుండ్ల బ్రహ్మేశ్వరానికి వెళ్లే  భక్తులు  పలువురు  అమరావతికి వచ్చి రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ దృష్టికి సమస్యను తెలిపారు.భక్తుల మనోభావాలకు అనుగుణంగా గుండ్ల బ్రహ్మహేశ్వర క్షేత్రానికి వెళ్లేందుకు రెండు రోజులపాటు అనుమతి ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు రాతపూర్వక విజ్ఞప్తిని  మంత్రి  ఫరూక్ అందజేశారు. మంత్రి ఫరూక్ విజ్ఞప్తిపై  చర్యలు తీసుకోవాలని  అటవీ శాఖ ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించడంతో ఈ ఏడాది  నెలకొన్న సందిగ్ధత వీడింది.మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని  14,15 వ తేదీల్లో జిబి యం కు వెళ్లేందుకు భక్తులకు అనుమతి ఇస్తూ అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్. పి.వి.చలపతిరావు ఉత్తర్వులు జారీ చేశారు. స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి ఫరూక్ కృతజ్ఞతలు తెలిపారు. అటవీశాఖ నిబంధనలకు అనుగుణంగా భక్తులు గుండ్ల బ్రహ్మేశ్వరం ఆలయాన్ని సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి క్షేత్రం కు  మహాశివరాత్రికి వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా  మార్గం సుగుమం చేయించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు   కృతజ్ఞతలు తెలుపుతూ, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Scroll to Top