విలేకరులకు ‘చైతన్య జ్యోతి’ ఆర్థిక భరోసా….
ఏపీయుడబ్ల్యూజె అధ్యక్ష, కార్యదర్శులు మధుబాబు, ఉస్మాన్ బాషా, కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య





సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 14 :
నంద్యాల నియోజకవర్గ విలేకరుల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకొని ‘చైతన్య జ్యోతి’ పేరుతో ప్రత్యేక ఆర్థిక సహాయ పథకాన్ని నంద్యాల వాసి, ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త గోళ్ళ రాజేష్ ఆర్థిక సహకారంతో శనివారం పలువురు విలేకరులకు చెక్కులను పంపిణీ చేశారు. నంద్యాల పట్టణం శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మధుబాబు, ఉస్మాన్ భాషా, రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్యలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
గోళ్ళ రాజేష్ కార్యక్రమాల సమన్వయకర్త, నంద్యాల పట్టణ ఏపీయుడబ్ల్యూజే ఉపాధ్యక్షుడు నూర్ బాషా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య మాట్లాడుతూ గోళ్ళ రాజేష్ గత కొన్ని నెలలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని కొనియాడారు.నంద్యాల వాసిగా నంద్యాల పట్టణ ప్రజల మీద ప్రేమతో ఆయన స్థానికంగా లేకున్నా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు.
తమ కళాశాలలోనే బీకాం చదివిన గోళ్ళ రాజేష్ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం తమ కళాశాలకే గర్వకారణమన్నారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మధుబాబు మాట్లాడుతూ విలేకరులను గుర్తించిన గోళ్ల రాజేష్ కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. రాజకీయ నాయకులు కేవలం విలేకరులను వాడుకొని వదిలేస్తున్నారని,అటువంటిది వారి యొక్క సేవలను గుర్తించి వారికి తన వంతుగా ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల చొప్పున మొదటి విడతగా 50 మందికి అందజేయడం శుభపరిణామమని, అందుకు విలేకరుల తరఫున, యూనియన్ తరపున గోళ్ల రాజేష్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి ఉస్మాన్ బాషా మాట్లాడుతూ నంద్యాలలో గత కొన్ని నెలలుగా పలు రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ కౌలు రైతులకు అయితేనేమి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 2000 రూపాయలు చొప్పున అయితేనేమి, అలాగే నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగ యువతకు ఒక్కొక్కరికి 2000 చొప్పున కొన్ని లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసిన గోళ్ళ రాజేష్ కు నంద్యాల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రస్తుత సమాజంలో విలేకరులను గుర్తించి వారికి ఎటువంటి ఆదాయ వనరులు ఉండవనే సత్ సంకల్పంతో విలేకరులను ఆదుకోవడం ఆయన మంచి మనసుకు నిదర్శనమని కొనియాడారు.
జర్నలిస్టు సోదరులను ఆదుకున్న వ్యక్తిగా జర్నలిస్టులందరూ ఆయనకు మద్దతివ్వాలని పేర్కొన్నారు. గోళ్ళ రాజేష్ కార్యక్రమాల సమన్వయకర్త, నంద్యాల పట్టణ ఏపీయుడబ్ల్యూజే ఉపాధ్యక్షుడు నూర్ బాషా మాట్లాడుతూ గోళ్ళ రాజేష్ స్థానికంగా లేకున్నా తన ద్వారా ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేయడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. ప్రతిరోజు కొన్ని వందల మందికి రూపాయికే రెండు పుల్కాలు, కర్రీ, వెజిటబుల్ పలావ్, కర్రి, రొట్టె, పప్పును అందజేస్తున్నామని, గత రెండు నెలలుగా ఇది నిరంతరాయం కొనసాగుతుందని, పేదల ఆకలి తీర్చే ఆపద్బాంధవునిగా గోళ్ళ రాజేష్ ను కొనియాడారు.
పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు, జర్నలిస్ట్ రఫీ మాట్లాడుతూ కొందరు విలేకరులు సోషల్ మీడియాలో సేవా కార్యక్రమాలపై తప్పుడు రాతలు రాసారని, అటువంటి వారు వారి ఆత్మసాక్షిని ప్రశ్నించుకోవాలని హితవు పలికారు. ఇక్కడ సేవా కార్యక్రమాలన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయని, చెక్కుల రూపంలో అందజేస్తున్నారని, అటువంటిది ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు. తప్పుడు వార్తలు రాస్తే వారికి భవిష్యత్తు ఉండదని ఆయన హెచ్చరించారు.
మరో జర్నలిస్ట్ నాగేంద్ర మాట్లాడుతూ పేద ప్రజల కోసం సేవా కార్యక్రమాలు చేస్తున్న గోళ్ళ రాజేష్ జర్నలిస్టులను కూడా గుర్తించడం అభినందనీయమని, వీలైతే ఆయనకు సహకారం అందించాలి గాని తప్పుడు వార్తలతో, తప్పుడు కథనాలతో ప్రజల్లో గందరగోళం సృష్టించడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. విలేకరులను గుర్తించి తన వంతుగా మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడం గొప్ప విషయమని, ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండే జర్నలిస్టులను గుర్తించడం, అలాగే వారికి ప్రతినెలా తన వంతు సహాయంగా మూడు వేల రూపాయలు అందించడం ఆయన దాతృత్వానికి నిదర్శనమని కొనియాడారు. అనంతరం విలేఖరులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
