కేసీ కెనాల్ క్రింద ఆరుతడి పంటలకు చివరి తడి నీరు ఇప్పించండని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి కి రైతుల వినతి

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 08:
ప్రభుత్వం చెప్పిన విధంగానే కేసీ కెనాల్ క్రింద ఆయకట్టు రైతులం ఆరుతడి పంటలే సాగు చేసుకున్నామని, పొలంకు చివరి తడి నీరు పెడితే పంట చేతికి వస్తుందని, లేకుంటే పంట ఎడిపోయి తీవ్రంగా నష్టపోతామని, ఆరుతడి పంటలు కాపాడాలని పాములపాడు మండల రైతులు టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డికి విన్నవించారు. 
ఆదివారం పాములపాడు, ఎర్రగూడూరు, శాంతి నగరం, కంబాలపల్లె, రుద్రవరం, తదితర గ్రామాల రైతులు రుద్రవరం గ్రామం వద్ద మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి కి తమ గోడు వివరించారు. 
పాములపాడు మండలం మీదుగా అలగనూరు రిజర్వాయర్ కు వెళ్లే కర్నూలు- కడప ( కేసీ కెనాల్) కాలువ క్రింద ఆయకట్టు భూముల్లో మొక్కజొన్న, మినుములు, పెసర, జొన్న, తదితర ఆరుతడి పంటలు సాగుచేసుకున్నామని, చివరి తడి నీరు పొలంకు అందించకుంటే ఎండిపోతుందని, పంట చేతికి రాదని, ఎక్కువ నష్టపోతామని, పంటలు కాపాడెందుకు కేసీ కెనాల్ కు నీరు విడుదల చేయించాలని కెనాల్ క్రింద ఆయకట్టు రైతులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డిని కోరారు.
దీంతో వెంటనే స్పందించిన బైరెడ్డి రాజశేఖరరెడ్డి కేసీ కెనాల్ ఈ ఈ ప్రతాప్ దృష్టికి రైతుల కష్టం ఫోన్ ద్వారా వివరించారు. రైతుల ఇబ్బందిపై కేసీ కెనాల్ ఈ ఈ ప్రతాప్ స్పందించి పాములపాడు మండలం నుంచి అలగనూరు రిజర్వాయర్ కు వెళ్లే కాల్వకు నీటి విడుదలకు అంగీకరించి నీరు విడుదల చేయించారు. దీంతో పాములపాడు మండల పలు గ్రామాల రైతలు కురువ రమేష్, గాండ్ల సాయి, కురువ వెంకటేశ్వర్లు, హనుమంతు, మల్లికార్జున, ఈశ్వరయ్య తదితరులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

Scroll to Top