తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈనెల 24 వ తారీఖున జరుగు ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అని
గోడపత్రికలను విడుదల చేసిన సిపిఐ నాయకులు



సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 20 :
ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు విమర్శించారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి రూ. 4 లక్షల సాయం అందించకపోవడాన్ని నిరసిస్తూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ నెల 24న తహసీల్దార్ కార్యక్రమం వద్ద చేపట్టబోయే ధర్నాను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
శుక్రవారం నంద్యాల పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో పట్టణ సమితి ఆధ్వర్యంలో, పట్టణ నాయకుడు డి. శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ధర్నాకు సంబంధించిన గోడపత్రికలను ముఖ్యఅతిథిగా పాల్గొని అనంతరం జరిగిన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ
. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఊరూరా తిరిగి నిరుపేదలందరికీ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణానికి రూ. 4 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించి, అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఆ ఊసే ఎత్తకపోవడం దారుణమన్నారు.
గతంలో సిపిఐ ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతంలో ఇళ్లు లేని లబ్ధిదారులతో 3 వేల మందికి పైగా స్వీయ అర్జీలు ఇప్పించడం జరిగిందని, అప్పట్లో అర్హులైన వారిని గుర్తిస్తామని చెప్పి ఇప్పుడు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. పట్టణ ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో నివసిస్తున్న పేదల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, అందుకే గతంలో అర్జీలు ఇచ్చిన లబ్ధిదారులందరినీ కలుపుకొని ఈ నెల 24న రాష్ట్ర సమితి పిలుపు మేరకు నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఒకవేళ 24వ తేదీ ధర్నా తర్వాత కూడా కూటమి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే, నంద్యాల పట్టణంలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. పేదల పక్షాన సిపిఐ నిరంతరం పోరాడుతుందని, హామీలు నెరవేర్చే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. బాబా ఫకృద్దీన్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాముడు, సిపిఐ నాయకులు మురళీధర్, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్, సహాయ కార్యదర్శి లక్ష్మీదేవి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జి. హరినాథ్, మహిళా సమాఖ్య పట్టణ కన్వీనర్ సుశీలమ్మ, సరోజమ్మ, రమిజా, రవణమ్మ తో పాటు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
