
సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / ఫిబ్రవరి 17 :
శిరివెళ్ల మండలం వనికేందిన్నె గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 13వ తేదీ తెల్లవారుజామున గ్రామానికి చెందిన చిటికెల వెంకటేశ్వర్లు (55)ను ఆయన ఇంట్లో తలపై రోకలిబండతో దాడి చేసి హత్య చేసిన ఘటనపై గ్రామ వీఆర్ఓ మాలపాటి రవీంద్రరెడ్డి ఫిర్యాదు మేరకు శిరివెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ డీఎస్పీ సూచనలతో శిరివెళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పడి దర్యాప్తు చేపట్టాయి. నేర స్థలంలో సాంకేతిక ఆధారాలు సేకరించి విచారణ జరిపారు. దర్యాప్తులో మృతుడికి చిన్నాన్న వరుసలో వచ్చే చిటికెల దస్తగిరి (50), పెద్ద పక్కిరయ్య (56), రాముడు (44) ఆస్తి ఆశతో హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది. మృతుడికి సంతానం లేకపోవడం, కుటుంబ విభేదాలు ఉండటంతో ఇంటిని తమ అధీనంలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో తెల్లవారుజామున ఇంట్లోకి వెళ్లి రోకలిబండతో తలపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇంట్లో ఉన్న నగదు తీసుకుని పంచుకున్నట్లు వెల్లడించారు. పోలీసుల గాలింపు తీవ్రతరమవడంతో నిందితులు 17వ తేదీ మధ్యాహ్నం శిరివెళ్ల సర్కిల్ కార్యాలయం వద్ద లొంగిపోయారు. వారి వద్ద నుంచి రూ.30,000 నగదు, రోకలిబండ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయస్థానానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోంది.
