ఆపరేషన్ “వజ్రప్రహార్” లో భాగంగా నంద్యాల పట్టణ కేంద్రంలో కార్డన్ అండ్ సర్చ్ నిర్వహణ

  • నేర నియంత్రణకు ఈ కార్డన్ & సెర్చ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెల్పిన  ఏఎస్పి. ఎం.జావళి ఐపిఎస్
  • డ్రోన్ కెమెరాలతో మారుమూల ప్రాంతాలను తనిఖీ చేసినట్లు వెల్లడి

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / మార్చి 07 :

డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఐపిఎస్, ఆదేశముల మేరకు ఈగల్ చీఫ్ ఆకే రవి కృష్ణ ఐపిఎస్, ఐజిపి పర్యవేక్షణలో, నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపిఎస్ ఉత్తర్వుల మేరకు నంద్యాల సబ్ డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్  ఎం. జావళి ఐపిఎస్ ఆద్వర్యంలో నంద్యాల జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా, నంద్యాల సబ్ డివిజన్ లో రైల్వే స్టేషన్,గూడ్స్ షెడ్,బొగ్గులైన్ మొదలగు ప్రాంతాలలో సుమారు 40 మండి పోలీసు సిబ్బందితో నేడు కార్డన్ &సెర్చ్ ఆపరేషన్ విస్తృతంగా నిర్వహించబడింది.

ఈ సంధర్భంగా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఎం. జావళి ఐపిఎస్ మాట్లాడుతూ నేరగాళ్ల కదలికలను కనిపెట్టేందుకు మరియు మారుమూల ప్రాంతాలను తనిఖీ చేసేందుకు ఈ ఆపరేషన్‌లో అధునాతన డ్రోన్ కెమెరాలను  ఉపయోగించారు. ఖాళీ భవనాలు, నిర్మానుష్య ప్రదేశాలను డ్రోన్ల ద్వారా క్షుణ్ణంగా వీడియో రికార్డింగ్ చేస్తూ తనిఖీలు చేపట్టారు.ముఖ్యంగా మాదకద్రవ్యాల వినియోగం జరుగుతున్నట్లు అనుమానం ఉన్న ప్రాంతాలు, అద్దె ఇళ్లు,ఖాళీ భవనాలు,రైల్వే స్టేషన్ లో వాహనాలను మరియు అనుమానం ఉన్న ప్రయాణికులను  మరియు ఇతర అనుమానాస్పద ప్రదేశాలలో పోలీసులు సోదాలు నిర్వహించారు.

రౌడీ షీటర్లు మరియు సస్పెక్ట్ షీట్లు ఉన్న వ్యక్తులను స్పాట్ లో పిలిపించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారికీ సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.

ఈ సందర్భంగా పోలీసు అధికారులు ప్రజలకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక మరియు చట్టపరమైన దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించారు. గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు.  ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.  సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.

అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది మరియు ప్రజలతో కలిసి “ఆపరేషన్ వజ్రప్రహార్ ప్రతిజ్ఞ” నిర్వహించి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిజ్ఞ చేశారు. సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.  మాదకద్రవ్యాల వ్యాప్తిని పూర్తిగా అరికట్టే దిశగా “ఆపరేషన్ వజ్రప్రహార్” కింద ఇలాంటి ప్రత్యేక చర్యలు నిరంతరం కొనసాగుతాయని ప్రజల సహకారంతో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో  ఏఎస్పి తో పాటు ఇన్స్పెక్టర్లు వేణుగోపాల్, అస్రార్ భాష, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top