రేషన్ వేళల మార్పు- అర్బన్ తాసిల్దార్ శ్రీనివాసులు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఏప్రిల్ 03  :

ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రేషన్ సరుకుల పంపిణీ వేళల్లో మార్పులు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. రేషన్ దుకాణాలకు వచ్చే కార్డుదారులు వడదెబ్బకు గురికాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నంద్యాల అర్బన్ తాసిల్దార్ శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగిన పంపిణీని ఇకపై ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించాల్సిందిగా డీలర్లకు సూచించారు. ఎండ ప్రభావం ఎక్కువగా ఉండే సమయాలను నివారించడమే ఈ నిర్ణయానికి కారణమని పేర్కొన్నారు.  రేషన్ దుకాణాల వద్ద కార్డుదారుల కోసం తాగునీటి సదుపాయం తప్పనిసరిగా కల్పించాలి. అవసరాన్ని బట్టి షామియానాలు, టెంట్లు ఏర్పాటు చేసి నీడ కల్పించాలి. క్యూ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని, మహిళలు, వృద్ధులకు ప్రాధాన్యత ఇచ్చి ముందుగా సరుకులు అందజేయాలని ఆదేశించారు.  అలాగే అత్యవసర పరిస్థితుల కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలని, వడదెబ్బ నివారణకు సంబంధించిన సూచనలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. డీలర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Scroll to Top