
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఏప్రిల్ 03 :
రానున్న రోజుల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో జనసేన పార్టీ నాయకులతో కలిసి ముందుకు పోతానని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆళ్లగడ్డ పట్టణంలోని ఏవి ప్లాజా ఆవరణంలో అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఇకపై రాజధానిని మార్చడం ఎవరి తరం కాదన్నారు. దాదాపు ఏడు సంవత్సరాలుగా రాష్ట్రానికి స్పష్టమైన రాజధాని లేకపోవడం బాధ కలిగించిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చొరవతో అమరావతిని స్థిరపరిచి, భవిష్యత్తులో ఎవరూ మార్చలేని విధంగా పార్లమెంటులో బిల్లు ఆమోదం చేయించడాన్ని స్వాగతించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యనారాయణరెడ్డి, ధనుంజయరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఏవీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
