రెవెన్యూ ఆదాయ లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించాలిజిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా ఆదేశాలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 24 :
జిల్లాలోని ప్రధాన ఆదాయ వనరులైన ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, రిజిస్ట్రేషన్, రవాణా తదితర శాఖలకు కేటాయించిన వార్షిక ఆదాయ లక్ష్యాలను వందశాతం సాధించడమే కాకుండా, అధిగమించే దిశగా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఆదాయ వనరుల పెంపుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె శాఖల వారీగా ఆదాయ సాధన పురోగతిని సమీక్షించారు. సమావేశంలో డిఆర్ఓ రాము నాయక్‌తో పాటు ఎక్సైజ్, మైనింగ్, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్, రవాణా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ శాఖ మార్చి 31 నాటికి రూ.1,105 కోట్ల ఆదాయాన్ని సాధించే లక్ష్యాన్ని నిర్దేశించగా జనవరి 31 నాటికి 803 కోట్ల ఆదాయం ఆర్జించినప్పటికీ, మిగిలిన రూ.193 కోట్ల లక్ష్యాన్ని మార్చి నెలాఖరు వరకు సాధించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే మైనింగ్ శాఖ మార్చి చివరి నాటికి మొత్తం రూ.247 కోట్ల లక్ష్యం (మేజర్ మినరల్స్ కింద రూ.195 కోట్లు, మైనర్ మినరల్స్ కింద రూ.52 కోట్లు) నిర్దేశించగా ఇప్పటివరకు మేజర్ మినరల్స్ ద్వారా రూ.140.05 కోట్లు, మైనర్ మినరల్స్ ద్వారా రూ.70.31 కోట్లు కలిపి రూ.210.36 కోట్లు వసూలైనట్లు వెల్లడించారు. మిగిలిన రూ.36.64 కోట్ల వసూళ్ల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి శాఖల సమన్వయంతో ముందుకు సాగాలని కలెక్టర్ మైనింగ్ అధికారులను ఆదేశించారు.
వాణిజ్య పన్నులు శాఖ ద్వారా ఫిబ్రవరి చివరి నాటికి రూ.677.02 కోట్ల లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు రూ.531.59 కోట్లు వసూలైనట్లు తెలిపారు. మిగిలిన రూ.145.43 కోట్ల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ముఖ్యంగా జీఎస్టీ బకాయిల కింద ఉన్న రూ.80.44 కోట్లను బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని వసూలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి మార్చి చివరి నాటికి రూ.201 కోట్ల లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు రూ.183 కోట్లు ఆర్జించినట్లు తెలిపారు. మిగిలిన మొత్తాన్ని నిర్దిష్ట కార్యాచరణతో సాధించాలని ఆదేశించారు. రవాణా శాఖ ద్వారా మార్చి నాటికి రూ.160.54 కోట్ల లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు రూ.133.79 కోట్లు వసూలైనట్లు తెలిపారు. మిగిలిన రూ.26.75 కోట్ల వసూళ్లను వేగవంతం చేయాలని సూచించారు. లీగల్ మెట్రాలజీ శాఖ నుండి రూ.77 లక్షల లక్ష్యానికి గాను ఇప్పటికే రూ.76 లక్షలు వసూలైనట్లు తెలిపారు. లక్ష్యాన్ని పూర్తిగా సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.
గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రెవెన్యూ ఆదాయంలో స్పష్టమైన వృద్ధి కనిపించేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆదాయ వనరులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, లక్ష్య సాధనలో ఎలాంటి అలసత్వం లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

Scroll to Top