

సత్యం వార్త / (పాణ్యం) నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 01 :
జిల్లాలో ప్రభుత్వ విద్యా, పోషణ సేవల నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం పాణ్యం మండలంలో విస్తృతంగా పర్యటిస్తూ పలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సేవల అమలు తీరును సమీక్షిస్తూ సంబంధిత అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు.*
మొదటగా సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక అవసరాల పిల్లల శిక్షణ కేంద్రం (భవిత సెంటర్)ను పరిశీలించిన కలెక్టర్, కేంద్రం పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం, పిల్లల హాజరు శాతం తక్కువగా ఉండడం, సరైన వసతులు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలకు అనుకూలమైన వాతావరణం కల్పించడం, హాజరు శాతం పెంచడం, అవసరమైన అన్ని సౌకర్యాలను తక్షణం కల్పించాల్సిందిగా ఆదేశించారు. అలాగే ఐఈ రిసోర్స్ పర్సన్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని గట్టిగా ఆదేశించారు.
అనంతరం పాణ్యం మండలంలోని అంగన్వాడి కేంద్రాలు (4, 5)ను పరిశీలించిన కలెక్టర్, పిల్లల హాజరు నమోదు విధానాన్ని సమీక్షించి హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. వంటగదిలోని ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి, ప్రభుత్వం నిర్దేశించిన మెనూను ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. కేంద్ర పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ, ముఖ్యంగా టాయిలెట్ల నిర్వహణలో నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తదుపరి పాణ్యం మండలంలోని ఎంపీ యుపిఎస్ ఉర్దూ పాఠశాలను పరిశీలించిన కలెక్టర్, మధ్యాహ్న భోజన పథకం అమలుపై సమగ్రంగా ఆరా తీశారు. సన్నబియ్యం సరఫరా జరుగుతోందా అనే అంశాన్ని అధికారులను అడిగి తెలుసుకుంటూ, విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా విద్యార్థుల హాజరు నమోదు విధానం, పాఠశాల పరిసరాల పరిశుభ్రతపై ఉపాధ్యాయులకు సూచనలు జారీ చేశారు. పిల్లల విద్య, ఆరోగ్యం, పోషణ అంశాలలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు కావడం ద్వారా ప్రజలకు పూర్తి స్థాయి లాభాలు అందేలా అధికారులు కట్టుబడి పనిచేయాలని సూచించారు. సంబంధిత విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ సేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలని కలెక్టర్ ఆదేశించారు.
