పీజీఆర్ఎస్ ద్వారా 240 దరఖాస్తుల స్వీకరణ
రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 138 దరఖాస్తుల స్వీకరణ



సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 16 :
ప్రజల నుండి వచ్చే ఫిర్యాదుల పట్ల అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా, వాటిని నిర్ణీత సమయంలో వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తోగట ప్రియాంక, డిఆర్ఓ రామునాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదులను అధికారులు బాధ్యతగా తీసుకొని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో పరిష్కరించాల్సిన 2,797 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. అలాగే రీ-ఓపెన్ అయిన 293 దరఖాస్తులను వేగవంతంగా నాణ్యతగా పరిష్కరించాలన్నారు. అదేవిధంగా ఆడిట్ కేసులను కూడా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ప్రజా ప్రతినిధుల ద్వారా వచ్చే వినతులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి, వాటిని ముందుగానే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు..
రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 138 అర్జీల స్వీకరణ:
భూ సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరించే అవకాశం ఉందన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా మొత్తం 138 దరఖాస్తులు స్వీకరించగా, వాటిలో రెవెన్యూ, గ్రామ/వార్డు సచివాలయ సేవలకు సంబంధించినవి – 7, అడంగల్ సవరణలకు సంబంధించినవి – 24, చుక్కల భూముల క్రమబద్ధీకరణకు సంబంధించినవి – 22, 22-ఎ భూములకు సంబంధించినవి – 8, అసైన్డ్ భూములు, భూ ఆక్రమణలకు సంబంధించినవి – 24, రెవెన్యూ కోర్టు విచారణలు / ఆర్ఓఆర్ అంశాలకు సంబంధించినవి – 34, సర్వే, రీ-సర్వేలకు సంబంధించినవి – 34, దేవాదాయ, వక్ఫ్ భూములకు సంబంధించినవి – 7 వచ్చాయని కలెక్టర్ వివరించారు.
