ప్రజలు అపోహలు నమ్మకుండా అవసరానికి అనుగుణంగా మాత్రమే బుకింగ్ చేసుకోవాలి

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 16 :
జిల్లాలో వంట గ్యాస్ (ఎల్పిజి) సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని, ప్రజలు అపోహలకు లోనవకుండా అవసరానికి అనుగుణంగా మాత్రమే సిలిండర్లు బుక్ చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా ఫిర్యాదు స్వీకరణలో భాగంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా, పర్యవేక్షణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ప్రతిరోజూ సగటున సుమారు 10,000 గ్యాస్ సిలిండర్లు సరఫరా అవుతున్నాయన్నారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని అధికారులు తెలిపారు. అయితే గత 3–4 రోజులుగా గ్యాస్ బుకింగ్స్ సంఖ్య అసాధారణంగా పెరిగి రోజుకు సుమారు 46,000కు చేరుకుందని, కొంతమంది వినియోగదారులు ఖాళీ సిలిండర్లు లేకపోయినా ముందస్తుగా బుకింగ్స్ చేస్తున్నట్లు గుర్తించినట్టు చెప్పారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జేసీ అధికారులను ఆదేశించారు.
జిల్లాలోని 35 గ్యాస్ ఏజెన్సీల కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు మండల రెవెన్యూ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల స్థాయి అధికారులను ప్రత్యేకంగా నియమించామన్నారు. ఈ అధికారులు ప్రతి ఆరు గంటలకు ఒకసారి గ్యాస్ స్టాక్, బుకింగ్స్ మరియు డెలివరీ వివరాలను సమీక్షించి నివేదికలు సమర్పించాలని ఆదేశించామన్నారు. గ్యాస్ సిలిండర్ల మళ్లింపు లేదా బ్లాక్ మార్కెటింగ్ వంటి అక్రమాలను అరికట్టేందుకు ఆర్డీవోలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు…
సంక్షేమ సంస్థలకు ప్రాధాన్యత : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, సంక్షేమ వసతిగృహాలు మరియు ప్రభుత్వ ఆసుపత్రులు (జీజీహెచ్ వంటి) సంస్థల్లో గ్యాస్ కొరత లేకుండా అవసరమైన సిలిండర్ల సరఫరాను ప్రాధాన్యతతో అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు…
ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు : గ్యాస్ సరఫరా సంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కాల్ సెంటర్లో వెల్ఫేర్, హెల్త్ మరియు ఎడ్యుకేషన్ విభాగాల ప్రతినిధులు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తారన్నారు.
