ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి



సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 28:
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ సందర్భంగా లబ్ధిదారుల కళ్లలో ఆనందం కనిపించడం ప్రభుత్వానికి గొప్ప సంతృప్తినిస్తోందని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎండి ఫరూక్ అన్నారు. శనివారం నంద్యాల పట్టణం లోని సద్దులపేట, బుడగ జంగాల వీధిలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రితో పాటు జి. రాజకుమారి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పింఛన్ మొత్తాన్ని దశలవారీగా పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడుదేనని తెలిపారు. గతంలో రూ.200గా ఉన్న పింఛన్‌ను రూ.1,000కు, అనంతరం రూ.2,000కు పెంచినట్లు పేర్కొన్నారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3,000గా ఉన్న పింఛన్‌ను రూ.4,000కు పెంచుతూ, అదనంగా మూడు నెలల పెంపు మొత్తాన్ని కలిపి తొలి నెలలోనే రూ.7,000 చొప్పున లబ్ధిదారులకు అందజేసినట్లు వివరించారు. ప్రతి నెల 1వ తేదీన పింఛన్ పంపిణీ జరుగుతుందని, ఒకటవ తేదీ ఆదివారం వంటి సెలవు రోజు వస్తే ముందస్తుగా పింఛన్ అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో, రాష్ట్రవ్యాప్తంగా ఒక రోజు ముందుగానే ఫిబ్రవరి 28న పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. నంద్యాల పట్టణం సహా జిల్లాలోని అన్ని వార్డులు, గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారని అన్నారు.
జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, జిల్లాలో ప్రతి నెలా ఒకటో తేదీన సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఈసారి మార్చి 1 ఆదివారం కావడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా ఫిబ్రవరి 28న ముందస్తుగా పంపిణీ చేపట్టామని చెప్పారు. నంద్యాల జిల్లాలో దాదాపు 2,16,000 మంది లబ్ధిదారులకు సుమారు రూ.92 కోట్ల పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. జిల్లాలో సుమారు 4,700 మంది పింఛన్ డిస్బర్స్మెంట్ అధికారులు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేస్తున్నారని తెలిపారు. ప్రతి నెలా సుమారు 97 శాతం పంపిణీ విజయవంతంగా పూర్తవుతోందని పేర్కొన్నారు.
బుడగజంగం కాలనీలో కలెక్టర్ స్వయంగా పర్యటించి లబ్ధిదారుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారి కుటుంబ పరిస్థితులు, పిల్లల విద్య, జీవనోపాధి అవకాశాలపై ఆరా తీశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి ప్రతి అర్హుడికి చేరేలా జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. త్వరలోనే ఆ కాలనీలో వార్డు సభ నిర్వహించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని అవసరమైన సేవలు మరింత సమర్థవంతంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ విశ్వనాధ్, నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఎమ్మార్వో శ్రీనివాసులు, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
