

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 23 :
ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలకు సంబంధించి నిర్దేశించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPIలు) లో ప్రస్తుతం ‘బి’, ‘సి’ గ్రేడ్లలో ఉన్న ప్రభుత్వ శాఖలు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకుని, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి ‘ఎ’ గ్రేడ్ సాధించాల్సిందిగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో శాఖల వారీగా నిర్దేశించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ప్రగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని శాఖలకు కలిపి కేటాయించిన 312 పారామీటర్లలో ప్రస్తుత గణాంకాల ప్రకారం జిల్లాలో 30 శాఖలు ‘బి’ గ్రేడ్‌లో, 45 శాఖలు ‘సి’ గ్రేడ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ శాఖలు సమిష్టిగా కృషి చేసి తమ పనితీరును మెరుగుపరుచుకుని ‘ఎ’ గ్రేడ్ సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. ప్రస్తుతం ‘సి’ గ్రేడ్‌లో వ్యవసాయం, ఉద్యాన శాఖ, సెరికల్చర్, రిజిస్ట్రేషన్, ఫిషరీస్, ఫారెస్ట్, స్కూల్ ఎడ్యుకేషన్, మెడికల్ అండ్ హెల్త్, పోలీస్ శాఖలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే ‘బి’ గ్రేడ్‌లో ఆర్ అండ్ బి, హౌసింగ్, ఇండస్ట్రీస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్ తదితర శాఖలు ఉన్నాయని తెలిపారు. ఈ శాఖలు తమ గ్రేడింగ్‌ను మెరుగుపరుచుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా స్థూల ఉత్పత్తికి సంబంధించిన కీలక ఆర్థిక సూచీలపై సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ సూచీల ఆధారంగానే జిల్లా అభివృద్ధి స్థాయిని అంచనా వేయబడుతుందని కలెక్టర్ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలులో తక్కువ శాతం నమోదైన విభాగాల్లో లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. డేటా ఎంట్రీ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా, ప్రతి నెలా 5వ తేదీ లోపు సంబంధిత హెచ్‌ఒడీలు స్వయంగా డేటాను పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిపిఓ ఓబులేషు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
