

జుమ్మా ప్రార్థనలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్
ముఖ్య అతిథులుగా హాజరైన మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
సత్యం వార్త / జనవరి 23 :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల స్థాయి మూడు రోజుల ‘దీన్-ఏ-తబ్లిగ్’ ఇస్తేమా కడప నగర శివార్లలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ నందు (శుక్రవారం) మధ్యాహ్నం అత్యంత ఘనంగా ప్రారంభమైంది. పవిత్ర జుమ్మా ప్రార్థనలతో ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక సదస్సుకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి లక్షలాది మంది ముస్లిం సోదరులు, ఇస్లామిక్ పండితులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం మరియు ఆధ్యాత్మిక చింతన పెంచడంలో ఇస్తేమా వంటి సదస్సులు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
నంద్యాల తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఇస్తేమా నిర్వహణ కోసం తీసుకున్న చర్యలను, కల్పించిన వసతులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన మత పెద్దలు మరియు భారీ సంఖ్యలో స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు. రాబోయే మూడు రోజుల పాటు ఈ వేదికపై ప్రముఖ ఇస్లామిక్ పండితులచే ధార్మిక ప్రసంగాలు, సామూహిక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం జరిగే ‘దువా’ (ప్రత్యేక ప్రార్థన)తో ఈ ఇస్తేమా ముగుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
