హాస్టళ్లపై కమిషనర్ కఠిన హెచ్చరిక

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 24 :

స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 కార్యక్రమంలో భాగంగా నంద్యాల పురపాలక సంఘం పరిధిలోని 20వ వార్డు లలితనగర్ ప్రాంతంలో బ్యాంకు కోచింగ్ విద్యార్థుల హాస్టల్ నిర్వాహకులతో కమిషనర్ బి. శేషన్న స్థానిక రామాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హాస్టల్ పరిసరాల్లో అపరిశుభ్రత అస్సలు సహించబోమని స్పష్టం చేశారు.  హాస్టళ్ల చుట్టుపక్కల ఖాళీ ప్రదేశాల్లో చెత్తాచెదారం వేయడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని, గత ఐదు రోజులుగా పారిశుధ్య కార్మికులతో ప్రత్యేకంగా శుభ్రపరిచినట్లు తెలిపారు. మళ్లీ ఇలాంటి పరిస్థితులు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రతి హాస్టల్‌లో తడి చెత్త, పొడి చెత్త కోసం వేర్వేరు డస్ట్‌బిన్స్ ఏర్పాటు చేయాలని, పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో నాణ్యత, శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.  అలాగే ట్రేడ్ లైసెన్సులు, నీటి కొళాయిలు, ఆస్తి పన్నులు తదితర బకాయిలను వెంటనే చెల్లించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top