స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు పటిష్టంగా అమలు చేయాలి

20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో /జనవరి 8 :
స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్య సాధన దిశగా కేంద్ర ప్రాయోజిత పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా, సమర్థవంతంగా అమలు చేయాలని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో 20 పాయింట్ ఫార్ములా అమలుపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వలసల రామకృష్ణ, డీఆర్ఓ రాము నాయక్, సీపీఓ ఓబులేసు సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం “విబి–జి రామ్ జి (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్)” కార్యక్రమాన్ని ఏప్రిల్ 1 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కొత్త విధానంలో లేబర్, మెటీరియల్, పరిపాలనా వ్యయాలను కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులతో భరిస్తుందన్నారు. దీని ద్వారా ఉపాధి హామీ పనిదినాలను 100 నుంచి 125 రోజుల వరకు పెంచడం జరుగుతుందని, ఇది మానవ వనరుల అభివృద్ధికి తోడ్పడడంతో పాటు స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు దోహదపడుతుందన్నారు.

వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షలో భాగంగా జననీ సురక్ష యోజన కింద గర్భిణీలకు అందుతున్న సేవలు, నగదు సహాయంపై వివరాలు తెలుసుకున్నారు. సున్నిపెంట ప్రాంతంలో గిరిజనుల సంఖ్య అధికంగా ఉండటంతో అక్కడి సీహెచ్సీలో గైనకాలజిస్టు నియామకానికి చర్యలు తీసుకుంటామని, ఈ అంశాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రితో చర్చిస్తామని తెలిపారు. విద్యా శాఖకు సంబంధించి పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధికి వివిధ దశల్లో మంజూరైన నిధులను మార్చి 31 నాటికి పూర్తిగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు. సమగ్ర శిక్ష ద్వారా జిల్లాలో 1.39 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద ఎస్సీ, బీసీ కాలనీల్లో తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని, మూల జలాశయం నుంచి చివరి ఇంటి వరకు నీటి మ్యాపింగ్ సక్రమంగా నిర్వహించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు.

పీఎం సూర్య ఘర్ పథకంలో పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు నమోదు కావడాన్ని అభినందిస్తూ, బ్యాంకర్లు లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని సూచించారు. మెప్మా మహిళా సంఘాల ద్వారా పథకంపై విస్తృత అవగాహన కల్పించాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి హామీ పనుల ద్వారా ప్రతి గ్రామంలో ఉత్పాదక ఆస్తుల సృష్టిపై దృష్టి సారించాలని, కేటాయించిన బడ్జెట్‌ను మార్చి 31లోగా పూర్తిగా వినియోగించాలని డ్వామా అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ కార్డులు, పీఎం సూర్య ఘర్ వంటి పథకాల అమలులో వేగం పెంచి ప్రజలకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వైద్య శాఖకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారాన్ని సమగ్రంగా సేకరించాలని ఆదేశించారు. అలాగే, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సంబంధిత అన్ని శాఖలతో సమన్వయం సాధిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రభుత్వ పథకాలు ప్రజలకు సకాలంలో, సమర్థవంతంగా అందుతాయని కలెక్టర్ తెలిపారు.

Scroll to Top