

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 09 :
సర్వ క్షేత్రములకు రత్నమైన శ్రీ కాళహస్తి క్షేత్రం భూలోకంలో దక్షిణ కైలాసంగా, భాస్కర క్షేత్రంగా, సద్యోముక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పంచభూత క్షేత్రాలలో వాయు లింగ క్షేత్రంగా విశేష ఖ్యాతిని గాంచింది.
మూగ జీవాలకు మోక్షం ప్రసాదించిన క్షేత్రంగా, రాహు కేతు పూజలకు ప్రసిద్ధిగా శ్రీ కాళహస్తి క్షేత్రం భక్తుల విశేష ఆరాధనకు నిలుస్తోంది.
ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరుగుతున్న మహా శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి అవసరమైన కూరగాయలను నంద్యాల కు చెందిన ప్రముఖ వ్యాపారి మార్కెట్ ప్రసాద్ స్వామి సేవలో వితరణ చేస్తున్నారు.
ఈ ఏడాది బ్రహ్మోత్సవాల కోసం సుమారు 40 టన్నుల కూరగాయలను అన్నదాన కార్యక్రమానికి అందించడం విశేషంగా నిలిచింది. సోమవారం సాయంత్రం లారీ ల ద్వారా నంద్యాల నుంచి శ్రీ కాళహస్తి కి కూరగాయలను పంపించారు. గత 19 సంవత్సరాలుగా తన కుటుంబ సభ్యుల సహకారంతో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ కాళహస్తి దేవస్థానానికి నిరంతరంగా కూరగాయల వితరణ చేస్తూ సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నట్లు మార్కెట్ ప్రసాద్ తెలిపారు.
పరమేశ్వరుని ఆశీస్సులతో రెండున్నర టన్నుల కూరగాయల వితరణతో ప్రారంభమైన ఈ సేవ నేడు 40 టన్నుల స్థాయికి చేరిందని ఆయన పేర్కొన్నారు. భక్తుల కోసం సేవ చేయడమే తమ కుటుంబానికి లభించిన పరమ భాగ్యంగా భావిస్తున్నట్లు తెలిపారు. నంద్యాల జిల్లా లో జరిగే పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూరగాయల వితరణ చేస్తూ సమాజంలో మంచి గుర్తింపు పొందినట్లు వివరించారు.
ప్రస్తుతం శ్రీ కాళహస్తి దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి ఆధ్వర్యంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో సాగుతున్నాయని, భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆనందకరమని తెలిపారు. స్వామి సేవలో నిస్వార్థంగా సేవలందిస్తున్న మార్కెట్ ప్రసాద్ కుటుంబాన్ని పలువురు భక్తులు, దేవస్థానం అధికారులు అభినందించారు.
