

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 10 :
శ్రీకాళహస్తిలో నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు నంద్యాల పట్టణానికి చెందిన మార్కెట్ ప్రసాద్ శ్రీ కాళహస్తి దేవస్థానానికి 40 టన్నుల కూరగాయలను వితరణ చేశారు. భక్తుల సేవే ప్రధాన లక్ష్యంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం విశేషంగా నిలిచింది.
నంద్యాల నుంచి సోమవారం సాయంత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లారీలో భారీగా కూరగాయలను శ్రీకాళహస్తికి తరలించారు. మంగళవారం ఈ కూరగాయలను శ్రీ కాళహస్తి దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి కి అధికారికంగా అప్పగించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు అందించే అన్నప్రసాదం, నైవేద్యాలు, ఆలయ అవసరాల కోసం ఈ కూరగాయలు ఉపయోగపడనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ కాళహస్తి దేవస్థానానికి లక్షలాది భక్తులు తరలివస్తారని, వారి కోసం నిరాఘాటంగా అన్నప్రసాదం అందించాలనే ఉద్దేశంతో మార్కెట్ ప్రసాద్ ఈ విరాళాన్ని అందించినట్లు పేర్కొన్నారు. భక్తుల ఆకలిని తీర్చడమే నిజమైన సేవ అనే భావనతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
అనంతరం మార్కెట్ ప్రసాద్ శ్రీ కాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ తో స్నేహపూర్వకంగా కలసి బ్రహ్మోత్సవాల నిర్వహణ, భక్తుల సౌకర్యాలపై చర్చించారు. నంద్యాల నుంచి వచ్చిన ఈ భారీ విరాళం ఉత్సవాల ఏర్పాట్లకు మరింత బలం చేకూరుస్తుందని దేవస్థానం అధికారులు అభిప్రాయపడ్డారు.
భక్తుల సేవలో నంద్యాల ప్రజల భాగస్వామ్యం అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరో ముందుకు రావడానికి ప్రేరణగా నిలుస్తాయని దేవస్థానం అధికారులు పేర్కొన్నారు.
