విద్యా రంగంలో అంజద్ బాషా సిద్ధిఖీ సేవలు చిరస్మరణీయం

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 31 :

నంద్యాల పట్టణంలోని ఎన్.జి.ఓ. కాలనీలో గల ఖలీల్ సిద్ధిఖీ ఎయిడెడ్ హైస్కూల్లో ఉర్దూ మున్షీగా సుదీర్ఘ కాలం సేవలందించిన అంజద్ బాషా సిద్ధిఖీ పదవీ విరమణ మహోత్సవం మంగళవారం పాఠశాల ప్రాంగణంలో అత్యంత ఘనంగా జరిగింది.  37 ఏళ్ల పాటు విద్యాబోధనతో పాటు సామాజిక సేవా రంగంలో ఆయన చేసిన కృషిని కొనియాడుతూ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం మరియు వివిధ సంఘాల నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు.

​అంజద్ బాషా సిద్ధిఖీ నవంబర్ 01, 1989 నుండి మార్చి 31, 2026 వరకు దాదాపు 37 సంవత్సరాల పాటు నిరంతరాయంగా విద్యా సేవలు అందించారు. వీరి సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, “డాక్టర్ అబ్దుల్ హక్ స్మారక అవార్డు” తో గౌరవించింది. కేవలం ఉపాధ్యాయునిగానే కాకుండా, నంద్యాల జిల్లా ఇమాముల సంఘం మరియు మైనారిటీ సంఘాల సంస్కర్తగా సామాజికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా పేద ముస్లిం మహిళలకు ఉచిత వివాహాలు జరిపించడం, పేద విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచారు.

​ఈ సందర్భంగా పాఠశాల మేనేజర్ & కరస్పాండెంట్ ముస్తాక్ మహమ్మద్ సిద్ధిఖీ మరియు ప్రధానోపాధ్యాయులు కే.ఎం. ఫసిహుద్దీన్ సిద్ధిఖీ గారు మాట్లాడుతూ.. అంజద్ బాషా తమ విజ్ఞానాన్ని, అనుభవాన్ని ఇన్నేళ్లపాటు విద్యార్థులకు పంచడం అభినందనీయమని కొనియాడారు. క్రమశిక్షణకు, అంకితభావానికి ఆయన నిలువుటద్దమని, ఆయన పదవీ విరమణ అనంతర జీవితం సుఖశాంతులతో, ఆరోగ్యంగా గడవాలని ఆకాంక్షించారు.

​ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఇమాముల సంఘం నాయకులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, మైనారిటీ సంఘాల ప్రతినిధులు మరియు పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంజద్ బాషా సిద్ధిఖీ గారిని దుశ్శాలువలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

Scroll to Top