

అర్జీదారులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి
- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 19 :
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భూసమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్స్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తూ, అర్జీదారులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి డీఆర్ఓను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణంలో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్స్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్జీల నమోదు విధానం, అర్జీదారులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి కౌంటర్ వద్ద స్పష్టమైన బోర్డులు ఏర్పాటు చేయాలని, విభిన్న ప్రతిభావంతుల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద అవసరమైన సదుపాయాలతో పాటు వీల్‌చైర్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, కలెక్టరేట్ ఆవరణలో పరిశుభ్రత కోసం డస్ట్బిన్లు ఏర్పాటు చేసి చెత్తను వాటిలోనే వేయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే వివిధ కౌంటర్ల వద్ద సరైన లైటింగ్, ఫ్యాన్ సదుపాయాలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, సాయంత్రం లోపే విద్యుత్ సదుపాయాలు కల్పించాలని కలెక్టరేట్ ఏఓను ఆదేశించారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా మొత్తం 185 అర్జీలు స్వీకరించగా, అందులో అడంగల్ సవరణకు 43, చుక్కల భూముల క్రమబద్ధీకరణకు 19, అసైన్డ్ మరియు భూ ఆక్రమణకు 21, రెవెన్యూ కోర్టు విచారణలకు 26, సర్వే/రిసర్వే సమస్యలకు 43, దేవాదాయ మరియు వక్ఫ్ భూములకు సంబంధించి 33 దరఖాస్తులు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.
