రాయలసీమలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు – మంత్రి పయ్యావుల కేశవ్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 04 :
రాయలసీమ జిల్లాల్లో హార్టికల్చర్ హబ్ అభివృద్ధి కోసం సుమారు రు. 40 వేల కోట్లను ఖర్చు చేయనున్నట్లు, ఇది ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలో శృంఖలాబద్ధమైన అభివృద్ధికి దారితీసే ఎకనామిక్ చైన్ రియాక్షన్‌గా మారుతుందని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. శనివారం నంద్యాల కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అధ్యక్షతన బడ్జెట్ అవుట్‌రీచ్ 2026–27 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, రాయలసీమలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామని, దానికి సుమారు రు.40 వేల కోట్లను ఖర్చు చేయనున్నామని తెలిపారు. ఇది ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలో శృంఖలాబద్ధమైన అభివృద్ధికి దారితీసే ఎకనామిక్ చైన్ రియాక్షన్‌గా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
బడ్జెట్‌పై ప్రజలకు అవగాహన కల్పించడం “బడ్జెట్ అవుట్‌రీచ్ 2026–27” కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. బడ్జెట్ రూపకల్పన అనేది అన్ని శాఖల సమన్వయంతో జరిగే ప్రక్రియ అని పేర్కొంటూ, ప్రతిపాదనల దశలోనే స్పష్టమైన ప్రణాళికలను సమర్పించడం అత్యంత ముఖ్యమని సూచించారు. గతంలో బడ్జెట్ ప్రక్రియ క్లిష్టంగా ఉండేదని, ప్రస్తుతం సాంకేతికత సహాయంతో సరళీకరణ జరిగి, తక్కువ సమయంలోనే వివరాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. “బడ్జెట్ ఇన్ బ్రీఫ్”, “గైడ్ టు బడ్జెట్” వంటి పుస్తకాల ద్వారా ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక సవాళ్లు ఎదురైనా, ఆర్థిక క్రమశిక్షణ, ఆదాయ వనరుల పెంపు ద్వారా పరిస్థితి మెరుగుపడుతోందన్నారు. ముఖ్యంగా కమర్షియల్ టాక్స్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్స్ వంటి శాఖల ద్వారా ఆదాయం పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. సేవారంగ అభివృద్ధి, ప్రైవేట్ పెట్టుబడుల ఆకర్షణ ద్వారా మల్టిప్లయర్ ఎఫెక్ట్ సృష్టించి రాష్ట్ర ఆర్థిక వృద్ధిని 11% నుంచి 15% వరకు పెంచడం లక్ష్యమని వెల్లడించారు. జిల్లా స్థాయిలో కూడా బడ్జెట్ సంస్కరణలు అమలు చేసి ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని అధికారులకు సూచించారు. బడ్జెట్‌లో పారదర్శకత పెంపు ద్వారా ప్రజలు ప్రభుత్వ పనితీరును సమీక్షించే స్థాయి ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, గతంతో పోలిస్తే ఈసారి బడ్జెట్ కేటాయింపులు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్‌లో సుమారు రూ.3.32 లక్షల కోట్ల కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు. ఆర్థిక శాఖ మంత్రి సమర్పించిన ఈ బడ్జెట్‌లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు రాష్ట్ర ప్రగతికి ప్రాధాన్యత ఇవ్వబడిందన్నారు. నియోజకవర్గాల వారీగా కూడా నిధులు కేటాయించడం ఈ బడ్జెట్ ప్రత్యేకతగా నిలిచిందని చెప్పారు. దాదాపు 40 నుండి 45 శాఖలకు సమగ్రంగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయని వివరించారు. ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధికి ఈ బడ్జెట్ కీలకంగా మారనుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తూ, “సూపర్ సిక్స్” పథకాల ద్వారా పేదలు, రైతులు మరియు సామాన్య ప్రజలకు గణనీయమైన లాభాలు చేకూరేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అధికారులందరూ ప్రభుత్వానికి సహకరించి, బడ్జెట్ ప్రయోజనాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అలాగే, ప్రభుత్వం పారదర్శక విధానాలతో ముందుకు సాగుతోందని, జిల్లా మరియు మండల స్థాయిల్లో ప్రజలకు బడ్జెట్ అంశాలపై అవగాహన కల్పించడం అవసరమని సూచించారు. అధికారులు మరియు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని మంత్రి ఆకాంక్షించారు.

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ. 3.32 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌లో రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా కేటాయింపులు చేసినట్లు తెలిపారు. జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిల్లో ఈ బడ్జెట్ కేటాయింపులపై స్పష్టత కల్పిస్తూ, ప్రజలందరికీ విస్తృత అవగాహన అందించే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను ప్రజలకు వివరించడంతో పాటు, వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కూడా తెలియజేస్తున్నామన్నారు.
“స్వర్ణాంధ్ర 2047” లక్ష్య సాధనకు ఈ బడ్జెట్ బలమైన పునాది వేస్తుందని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించే క్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని సూచించారు.
నంద్యాల జిల్లాకు కేటాయించిన రూ. 2626.92 కోట్లను, 45 శాఖలకు సంబంధించిన బడ్జెట్ వివరాలను పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలపై ఆధారపడిన, భరోసా నీటిపారుదల సౌకర్యాలు కలిగిన జిల్లాగా నంద్యాల ప్రత్యేకతను గుర్తించి, ప్రాధాన్యతా అంశాల మేరకు బడ్జెట్ ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం ఒక స్పష్టమైన దిశానిర్దేశం ఇస్తోందని పేర్కొంటూ, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేస్తేనే ఆర్థిక స్థిరత్వాన్ని సాధించగలమని అన్నారు. “స్వర్ణాంధ్ర” లక్ష్యాన్ని సాధించడానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ బడ్జెట్ నంద్యాల జిల్లా సమగ్ర అభివృద్ధికి ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

Scroll to Top