మీ ఇంటికి – మీ డాక్టర్ మొబైల్ మెడికల్ యూనిట్ ప్రారంభం – జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 23 :
గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న “మీ ఇంటికి – మీ డాక్టర్” వినూత్న ప్రాజెక్ట్‌లో భాగంగా మొబైల్ మెడికల్ యూనిట్‌ను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సోమవారం ప్రారంభించారు. నంద్యాల కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ ఆవరణలో సుమారు రూ.1.20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, డిఆర్ఓ రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు వారి ఇంటి వద్దకే నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మొబైల్ మెడికల్ యూనిట్ మార్చి నుండి మే 2026 వరకు నంద్యాల జిల్లాలోని బండి ఆత్మకూరు మండలంలోని 15 గ్రామాల్లో సేవలు అందించనుందన్నారు. “మీ ఇంటికి – మీ డాక్టర్” ప్రాజెక్ట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ నిధుల సహకారంతో అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మొత్తం రూ.8.40 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ 01 మార్చి 2026 నుండి అమల్లోకి వచ్చి, మూడు సంవత్సరాల పాటు కొనసాగనుందన్నారు. ఈ ప్రాజెక్ట్ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు (పాడేరు), నంద్యాల, పల్నాడు, తిరుపతి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అమలు చేస్తున్నారన్నారు. గ్రామీణ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడం, శిశు మరణాల రేటు, మాతృ మరణాల రేటు తగ్గించడం, అంటువ్యాధుల నియంత్రణ, 100% టీకాకరణ సాధించడం వంటి లక్ష్యాలతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుందని కలెక్టర్ తెలిపారు.
ప్రతి మొబైల్ మెడికల్ యూనిట్‌లో ఒక వైద్యుడు, నర్సు, ఫార్మసిస్ట్, డ్రైవర్ ఉంటారని, వీరు గ్రామాల్లో ప్రతి ఇంటిని సందర్శించి ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలు, ఎస్సీ/ఎస్టీ కాలనీలు, పేద కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు, మందులు అందిస్తారన్నారు. రోజుకు సుమారు 100 మందికి సేవలు అందించే ఈ యూనిట్, నెలకు 2000 మంది వరకు లబ్ధిదారులను చేరుకోగలదని కలెక్టర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నెలకు సుమారు 14,000 మంది, ఏడాదికి 2 లక్షల మంది, మూడు సంవత్సరాల్లో మొత్తం 6 లక్షల మందికి సేవలు అందించనున్నట్లు తెలిపారు. మార్చి నుండి మే 2026 వరకు వివిధ జిల్లాల్లోని ఎంపిక చేసిన మండలాల్లో ఈ ప్రాజెక్ట్ అమలు చేయబడుతుందని, ప్రాజెక్ట్ పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక అమలు కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం ప్రాణదానంతో సమానమని పేర్కొంటూ, యువత స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో నివసించే పేదలకు ఉచిత వైద్య సేవలు అందేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, సాంకేతిక నైపుణ్య అభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి నాగేశ్వరరావు, రెడ్ క్రాస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top