
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 14 :
అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా మార్చి 15న నిర్వహించనున్న ప్రాథమిక చదువు, సంఖ్యా నైపుణ్యాల అంచనా పరీక్షను జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా, మండల స్థాయి అధికారులతో టెలి సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు.
జిల్లాలో 1,62,235 మంది అభ్యాసకులను నమోదు చేయగా 1,368 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పరీక్ష నిర్వహించబడుతుందని చెప్పారు.
మార్చి 15న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో మంచినీరు, పారిశుధ్య సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని అధికారులను ఆదేశించారు.
పరీక్షలో చదవడం, రాయడం, లెక్కలు అనే మూడు విభాగాల్లో మొత్తం 150 మార్కులు ఉంటాయని తెలిపారు. ప్రతి విభాగంలో కనీసం 17 మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణులుగా పరిగణిస్తారని వివరించారు. పరీక్ష అనంతరం సమాధాన పత్రాలు పరిశీలించి మార్కులను సంబంధిత దరఖాస్తు వ్యవస్థలో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.
