




సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 10 :
9 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలకు హెచ్పివి (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) టీకా వేయించడం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను పూర్తిగా నివారించవచ్చని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా తెలిపారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని గాంధీనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికలకు చిన్న వయస్సులోనే హెచ్పివి టీకా వేయించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్రమాదాన్ని పూర్తిగా నివారించవచ్చన్నారు. అందువల్ల 9 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలందరికీ ఈ టీకా తప్పనిసరిగా అందేలా ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంపై తల్లిదండ్రులకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మానవ శరీరానికి సహజసిద్ధంగా ఉండే వ్యాధి నిరోధక శక్తి గురించి వివరించిన కలెక్టర్, పుట్టినప్పటి నుంచి తల్లి పాల ద్వారా లభించే సహజ రోగనిరోధక శక్తి తో పాటు, టీకాల ద్వారా ఏర్పడే సంపాదిత రోగనిరోధక శక్తి ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. చిన్నతనం నుంచే ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం ల ద్వారా అందించే టీకాలను సకాలంలో వేయించుకోవడం వల్ల భవిష్యత్తులో అనేక వ్యాధులను నివారించవచ్చన్నారు.
జలుబు, దగ్గు వంటి అంటువ్యాధులతో పాటు మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్, కిడ్నీ సమస్యల వంటి దీర్ఘకాలిక వ్యాధుల పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్సిడి 4.0 సర్వే ద్వారా ప్రతి ఇంటి ఆరోగ్య వివరాలను సేకరించి ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధుల గుర్తింపుకు సంబంధించి నిర్వహిస్తున్న ఎన్సిడి 4.0 సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. సచివాలయం పరిధిలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన ఆరోగ్య సమాచారం ఏఎన్ఎం ల వద్ద అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
గ్రామాల్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా లేదా బయట నగరాల్లో చికిత్స పొందుతున్నా వారి వివరాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం లు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలు, మందులు ప్రతి రోగికి అందుతున్నాయో లేదో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సేకరించిన ఆరోగ్య వివరాలను వెంటనే ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. వ్యాధులు సోకిన తర్వాత చికిత్స చేయడం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని కలెక్టర్ తెలిపారు. చిన్నతనం నుంచే పిల్లలకు అవసరమైన అన్ని రకాల టీకాలను సకాలంలో వేయించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చన్నారు. జిల్లాలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ లక్ష్య సాధనలో క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డా. వెంకటరమణ, డిసిహెచ్ఎస్ డా. శ్రీదేవి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. సుదర్శన్, ఇతర వైద్యాధికారులు, ఏఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
