ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించిన ఎన్ఎండీ ఫయాజ్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 24 :
నంద్యాల పట్టణంలోని 38వ వార్డు వైఎస్సార్ నగర్ బేడా బుడగజంగం కాలనీలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో దాదాపు 20 కుటుంబాలకు చెందిన పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న  రాష్ట్ర యువ నాయకుడు, స్థానిక మంత్రి తనయుడు ఎన్ఎండీ ఫయాజ్ స్పందించి బాధితులను పరామర్శించారు.

ఫయాజ్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాధితులు ఎవరూ ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. అందరికీ సముచితమైన వైద్య సేవలు అందేలా ఇప్పటికే డాక్టర్లు, అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా తక్షణ చికిత్స అందించి త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు, తమ నాయకులకు సమాచారం అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.

తాటికొండ బుగ్గరాముడు మాట్లాడుతూ..నంద్యాల పట్టణంలో సోమవారం రాత్రి జరిగిన ఒక వివాహ వేడుకలో,  పెళ్లిలో మిగిలిపోయిన ఆహారాన్ని చిన్నారులకు అందించడం, అది వికటించడంతో పలువురు పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆహారం కలుషితం కావడం వల్ల పిల్లలకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్, వారి కుమారులు ఫయాజ్, ఫిరోజ్ హుటాహుటిన స్పందించారు. అర్ధరాత్రి సమయంలోనే జిల్లా కలెక్టర్, డిఎంహెచ్ఓ మరియు స్థానిక వైద్యులతో మాట్లాడి బాధితులకు తక్షణ వైద్య సాయం అందేలా చర్యలు తీసుకున్నారు.
 మున్సిపల్ కమిషనర్ కూడా స్వయంగా శానిటేషన్ విభాగాన్ని అప్రమత్తం చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే శానిటేషన్ పనులు చేపట్టారు.”పెద్ద ప్రాణ నష్టం జరగకుండా అధికారులు, నాయకులు ముందుస్తు చర్యలు తీసుకోవడం అభినందనీయం. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కూడా వచ్చి ఇది ఆహారం వల్ల జరిగిన ఘటనగా ధృవీకరించారు.” 
ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. వైద్యులు మరియు పారిశుధ్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, వార్డు ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు, మరాఠీ సూరి, తాటికొండ మహేష్ బాబు, నందవరపు ప్రసాద్ రెడ్డి, హిమామ్ హుస్సేన్, వడ్డే నాగేంద్ర, కుమ్మరి కొటేశ్వరయ్య, రాఘవేంద్ర, కసిరెడ్డి ప్రసాద్ రెడ్డి, హుస్సేన్, ఫిరోజ్, మేషక్ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Scroll to Top