బంగారు కుటుంబాలు – మార్గదర్శుల మ్యాపింగ్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలి


సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 18 :
జిల్లాలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా అమలు చేస్తున్న పి-4 (ప్రభుత్వ–ప్రైవేటు–ప్రజల భాగస్వామ్యం) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో పి-4 కార్యక్రమం పురోగతిని సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ కుటుంబమూ పేదరికంతో బాధపడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పి-4 కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గుర్తించిన బంగారు కుటుంబాలను మార్గదర్శకులతో అనుసంధానం చేసి, వారు అందిస్తున్న సహాయ వివరాలను పి–4 పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు జిల్లాలో పేదరికంతో బాధపడుతున్న 50,038 బంగారు కుటుంబాలను గుర్తించినట్లు కలెక్టర్ వెల్లడించారు. వారికి అవసరమైన ఆర్థిక, సామాజిక, జీవనోపాధి సహాయాన్ని అందించేందుకు తొలి దశలో 4,311 మార్గదర్శులను ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరిలో 40,837 బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకుని సహాయం అందించేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇంకా 9,201 బంగారు కుటుంబాలకు మార్గదర్శుల మ్యాపింగ్ పూర్తి కాలేదని, మిగిలిన కుటుంబాలను “స్వర్ణ గ్రామం” పరిధిలో అర్హులైన మార్గదర్శులతో అనుసంధానం చేసి ఈ నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా, మొత్తం ఎన్ని బంగారు కుటుంబాలకు ఎన్ని మార్గదర్శులను నియమించారో, అందులో ఎంతమందిని లైసన్ (సమన్వయం) చేశారో పూర్తి వివరాలను సమగ్రంగా నమోదు చేసి పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. డేటా నమోదు విషయంలో నిర్లక్ష్యం వహించరాదని, పారదర్శకతతో పని చేయాలని హెచ్చరించారు. పి-4 కార్యక్రమం ద్వారా ప్రభుత్వ–ప్రైవేటు–ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధి సాధించడమే లక్ష్యమని, ప్రతి అర్హ కుటుంబానికి అవసరమైన చేయూత అందేలా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సిపిఓ ఓబులేష్ తదితరులు పాల్గొన్నారు.
