పాలకుల వైఫల్యంతోనే సీమ సాగునీటి రంగం అస్తవ్యస్తం

 ‘ఎత్తిపోతల’ అనీ.. ‘గోదావరి బనకచర్ల’ అనీ సీమ ప్రజలను మభ్యపెడుతున్నారు

నంద్యాలలో ‘సీమకు కావాలి – విచక్షణ జ్ఞానం’ పాట విడుదల.. ప్రాజెక్టుల సాధనే లక్ష్యం

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 12 :

రాయలసీమ అభివృద్ధి కోసం నందమూరి తారకరామారావు, వైయస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పలు ప్రాజెక్టులను వారి వారసులైన చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి కొనసాగించకపోవడం వలన రాయలసీమ సాగునీటి రంగం తీవ్ర అస్తవ్యస్తంగా తయారయిందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల కిందట మొదలైన తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు – నగరి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వలన నిర్దేశిత ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందడక పోవడం వలన రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని ఇది పాలకుల వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు నుండి ముప్పై రోజులలో రోజుకు నాలుగు టియంసిల చొప్పున 120 టియంసిల నీరు తెచ్చే అవకాశాలు వున్నప్పటికీ ఇది వదిలిపెట్టి ఒకరేమో రాయలసీమ ఎత్తిపోతల అని మరొకరేమో గోదావరి బనకచర్ల  అని ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాయలసీమతో పాటు సమగ్ర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికై ప్రజలలో చైతన్యం, సామాజిక అవగాహన పెంపొందించడానికి రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆద్వర్యంలో గురువారం నంద్యాల పట్టణంలోని IMA హాల్ నందు

“ప్రతి మనిషీ  లోకజ్ఞానే  !

ప్రతి మనిషీ  తత్వవేత్తే  !

ప్రతి వ్యక్తీ చైతన్యవంతుడే !

సీమకు కావాలి – విచక్షణ జ్ఞానం !” గీతాన్ని గురురాజ గ్రూపు సంస్థల అధినేత దస్తగిరిరెడ్డి, ప్రముఖ ENT వైద్య నిపుణులు డాక్టర్ మధుసూదనరావు, విశ్రాంత SBI మేనేజర్ సిద్దిఖీ లతో పాటను ఆవిష్కరించారు.

అనంతరం వక్తలు మాట్లాడుతూ సామాజిక స్ప్రహ కలిగించేలా పాటను గీతాన్ని రూపొందించిన దశరథరామిరెడ్డికి అభినందనలు తెలుపుతూ రాయలసీమ అభివృద్ధికి కోసం రాయలసీమ సాగునీటి సాధన సమితి చేపట్టే కార్యక్రమాలకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన హక్కులను సాధించుకోవడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సాహితీ వేత్తలు మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధి కోసం తాము కూడా సాహిత్యాలతో రాయలసీమ ఉద్యమానికి తోడ్పాటు అందిస్తామని తెలిపారు. అంతకుముందు బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్, తెలుగుగంగ, యస్ ఆర్ బి సి, ఎస్కేప్ ఛానల్ దగ్గర జరిగే అస్తవ్యస్త నీటి విడుదల గురించి తద్వారా ఆయా ప్రాజెక్టుల రైతులు పడుతున్న కష్టాలతో రూపొందించిన డాక్యుమెంటరీ ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో డాక్టర్ రమణారెడ్డి,  న్యాయవాదులు శంకరయ్య, అసదుల్లా, నందిరైతు సమాఖ్య అధ్యక్షులు బెక్కం రామసుబ్బారెడ్డి, ఉప్పలపాటి బాలీశ్వరరెడ్డి, మాజీ కౌన్సిలర్ మహమ్మద్ గౌస్, సాహితీవేత్తలు అన్నెం శ్రీనివాసరెడ్డి, కొప్పుల ప్రసాద్, మహమ్మద్ రఫి, గాయకులు శివరామిరెడ్డి, నారాయణగౌడ్, బాలవుశేని, ఆల్ మదర్ ఫౌండేషన్ నాయకులు ఆకుమల్ల రహీం, విశ్రాంత ఆంద్రాబ్యాంక్ ఎజియం శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top