
- జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 19 :
పర్యాటకులకు అవసరమైన సమాచారాన్ని సులభంగా అందుబాటులో ఉంచడం ద్వారా పర్యాటకుల సంతృప్తి పెరిగి, నంద్యాల జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల స్వీకరణ అనంతరం పర్యాటక సమాచార స్టిక్కర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ద్వారా అభివృద్ధి చేసిన బిల్వ స్వర్గం గుహలు, వాల్మీకి గుహలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు, విద్యార్థుల క్షేత్ర పర్యటనల్లో ఈ గుహలను చేర్చాలని, ఉపాధ్యాయుల ద్వారా ఫీల్డ్ విజిట్లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డీఈఓ ను ఆదేశించారు. ఈ చర్యలతో జిల్లాలో పర్యాటకుల సంఖ్య పెరిగి, జిల్లా స్థూల దేశీయోత్పత్తి (GDDP) వృద్ధికి తోడ్పడుతుందని ఆమె పేర్కొన్నారు. పర్యాటక సమాచారాన్ని ప్రజలకు చేరవేసే దిశగా నంద్యాల జిల్లాలోని అన్ని గ్రామ సచివాలయాలలో పర్యాటక సమాచార స్టిక్కర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక పర్యాటకం, ఈకో టూరిజం, సహజ గుహలు వంటి విభిన్న ఆకర్షణలు కలగలిసిన నంద్యాల జిల్లా పర్యాటకులకు అనుకూలమైన జిల్లాగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ తో పాటు, పర్యాటక అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ లక్ష్మీనారాయణ, టూరిజం అధికారి ఉమాదేవి, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, బెలుం గుహల యూనిట్ మేనేజర్ కిషోర్, బిల్వ స్వర్గం యూనిట్ మేనేజర్ మధు మోహన్ రెడ్డి, వాల్మీకి గుహల యూనిట్ మేనేజర్ గిరి పాల్గొన్నారు.
