

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 18 :
నంద్యాల పట్టణంలో నిర్మాణ & ధ్వంస వ్యర్థాల నిర్మాణ పనులను 2026 జూన్ 5వ తేదీ నాటికి తప్పనిసరిగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో నిర్మాణ & ధ్వంస వ్యర్థాల సమర్థ నిర్వహణ కోసం ప్రతిపాదించిన సి & డి ప్లాంట్ స్థాపన, ప్రారంభం మరియు ప్లాంటేషన్ కార్యక్రమాల పురోగతిపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పర్యావరణ ఇంజనీర్ పి.వి. కిషోర్ రెడ్డి, నంద్యాల ఆర్డీఓ సి. విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న, ఎపిఐఐసి జోనల్ మేనేజర్ వై. మధుసూదన్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో సి & డి ప్లాంట్ నిర్మాణ పనులను 2026 జూన్ 5వ తేదీ నాటికి తప్పనిసరిగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా, పట్టణ అభివృద్ధిని సమన్వయం చేస్తూ ఈ ప్లాంట్‌ను సమయానికి పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సి & డి వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ ద్వారా పట్టణంలో స్వచ్ఛత, పర్యావరణ సమతుల్యత మెరుగుపడుతుందని తెలిపారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎలాంటి ఆలస్యం లేకుండా వేగవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్లాంట్‌కు సంబంధించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను సిద్ధం చేయాలని ఎపిఐఐసి జోనల్ మేనేజర్ ను కలెక్టర్ ఆదేశించారు. ప్రాజెక్ట్‌లో అవసరమైన సాంకేతిక అంశాలు, వ్యయ అంచనాలు, పర్యావరణ అనుమతులు తదితర అంశాలు స్పష్టంగా ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
