
విద్యతో ఏదైనా సాధ్యం
-ప్రతి ఒక్కరు చెడు వ్యసనాలకు దూరం కావాలి
-రవీంధ్ర విద్యాసంస్థల అధినేత పుల్లయ్య
సత్యం వార్త/ నంద్యాల /జనవరి 4 : ప్రతి ఒక్కరు విద్యను అభ్యసించాలని, విద్యతో ఏదైనా సాధ్యం అవుతుందని రవీంధ్ర విద్యాసంస్థల అధినేత పులయ్య అన్నారు. ప్రతి ఒక్కరు చెడు వ్యసనాలకు దూరం కావాలని పిలుపునిచ్చారు. సంఘం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు ఐకమత్యంగా ఉండాలన్నారు. నంద్యాల పట్టణంలోని సిపిఎం కార్యాలయ సమావేశ భవనంలో ఆదివారం కుమ్మరి శాలివాహన సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సమావేశానికి హాజరైన ప్రముఖులతో కలిసి ఆయన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షులు మద్దయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాలివాహన విద్యార్ధులను మంచి విద్యావంతులుగా తయారు చేయడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. సిఎంసి విద్యాసంస్థల అధినేత ముణిశేఖర్ మాట్లాడుతూ పేద విద్యార్థులు చదువుకోవడానికి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. మద్దయ్య మాట్లాడుతూ కుమ్మరి శాలివాహనులు రాజకీయంగా ఎదగాలని కోరారు. రాజకీయంగా ఎదిగినప్పుడే మన లక్ష్యాలను సాధించవచ్చు అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ బలరాముడు మాట్లాడుతూ మన సంఘం పిల్లలకు ఎపిఆర్ జెసి మరియు పాలిటెక్నికల్ ఎంట్రన్స్ కోచింగ్ ఉచితంగా ఇప్పించడం జరుగుతుందన్నారు. సంఘం విద్యార్థులు ఐఎఎస్, ఐపిఎస్ లుగా తయారు చేయడానికి త్వరలో ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు పట్నం రాముడు, జిల్లా కోశాధికారి దస్తగిరి, రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ సుధాకర్, బేతంచెర్ల పారిశ్రామికవేత్త అనంతరాము, బిసి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్, కర్నూలు జిల్లా అధ్యక్షులు నాగన్న, నంద్యాల తాలుకా అధ్యక్షులు గురునాథ్, నాగభూషణం, తదితర సంఘ పెద్దలు పాల్గొన్నారు.
