నంద్యాల క్రీడాకారిణి పల్లవికి జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పతకం – సత్కరించిన నంద్యాల లయన్స్ క్లబ్

హర్యానాలో జరిగిన 34వ జాతీయస్థాయి పోటీలలో రజత పతక విజేత

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / జనవరి 29 :
నంద్యాల కు చెందిన క్రీడాకారిణి పల్లవి హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ లో ఇటీవల అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ కు అనుబంధంగా ఉన్న పవర్ లిఫ్టింగ్ ఇండియా నిర్వహణలో జరిగిన 34వ జాతీయ క్లాసిక్ బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ పోటీలలో జూనియర్ విభాగంలో 43 కేజీల కేటగిరీలో ద్వితీయ స్థానం సాధించి రజత పతకం అందుకుంది. ఈ సందర్భంగా నంద్యాల క్రీడా సమాఖ్య కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ తరపున పల్లవిని ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ ఒలింపిక్ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కోశాధికారి అమిదేల జనార్ధన్ శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ పల్లవి గతంలో కూడా రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పవర్ లిఫ్టింగ్ పోటీలలో ప్రతిభ కనబరచి పతకాలు సాధించిందని ఇప్పుడు మరొకసారి జాతీయస్థాయిలో బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో విజయం సాధించడం నంద్యాలకు గర్వకారణం అన్నారు. నిరంతర సాధన ద్వారా భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు,కోశాధికారి అమిదేల జనార్ధన్, పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు మహేష్ పాల్గొన్నారు.

Scroll to Top