

ఘనంగా క్యాప్టెన్ల అభినందన కార్యక్రమంలో జాతీయ స్పూర్తి వెల్లువ..
నంద్యాల పట్టణంలోని శాంతినికేతన్ స్కూల్లో క్యాప్టెన్ల అభినందన కార్యక్రమం మరియు దేశభక్తి గీతం ‘వందేమాతరం’కు 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు,నృత్యాలు,నాటికలు,ప్రసంగాలు సభికులను ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర్య ఉద్యమంలో “వందేమాతరం”గీతం పోషించిన పాత్రను వివరిస్తూ విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని రగిలించాయి.
క్యాప్టెన్ల అభినందన కార్యక్రమంలో స్కూల్కు నూతనంగా ఎన్నికైన క్యాప్టెన్లు,వైస్ క్యాప్టెన్లు బాధ్యతలు స్వీకరించారు. విద్యార్థుల్లో నాయకత్వం,క్రమశిక్షణ,సేవాభావం పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ.. “విద్యతో పాటు దేశభక్తి,నైతిక విలువలు,నాయకత్వ లక్షణాలు విద్యార్థుల్లో నాటాల్సిన అవసరం ఉంది.
ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులను మంచి పౌరులుగా,రేపటి నాయకులుగా తీర్చిదిద్దుతాయి” అని అన్నారు.
ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన శాంతినికేతన్ స్కూల్ అధినేత సుధాకర్ ఆధ్వర్యంలోని యాజమాన్యాన్ని,ఉపాధ్యాయ బృందాన్ని ఎంపీ బైరెడ్డి శబరి ప్రత్యేకంగా అభినందించారు. చివరగా జాతీయ గీతంతో కార్యక్రమం ముగిసింది.
