డ్రైనేజీ ఆక్రమణలు సహించము – మున్సిపల్ కమిషనర్ బి శేషన్న

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 03:
పట్టణంలోని ప్రధాన వీధులు, కాలనీల్లో డ్రైనేజీలను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న స్పష్టం చేశారు. మంగళవారం మున్సిపల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
శానిటేషన్ సూపరైజర్లు లక్ష్మినారాయణ, శివప్రసాద్ రెడ్డితో కలిసి కమిషనర్ పట్టణంలోని కీలక కాలనీలు, రహదారులను సందర్శించారు. డ్రైనేజీలపై కాంక్రీట్ నిర్మాణాలు, షెడ్లు, మెట్లు, ర్యాంపులు నిర్మించి నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్న ఆక్రమణలను గుర్తించారు. వెంటనే వాటిని తొలగించేందుకు సంబంధిత సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
డ్రైనేజీలు మూసివేయడం వల్ల వర్షాకాలంలో నీరు నిల్వై రహదారులు దెబ్బతినే ప్రమాదం ఉందని కమిషనర్ హెచ్చరించారు. ఇటువంటి చర్యలు ప్రజల ఆరోగ్యానికి హానికరమని, దోమల వ్యాప్తికి కారణమవుతాయని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకోవాలని, లేనిపక్షంలో మున్సిపాలిటీ యంత్రాంగం ద్వారా కూల్చివేతలు చేపడతామని స్పష్టం చేశారు.
పట్టణ పరిశుభ్రత, పారిశుద్ధ్యం మెరుగుపర్చడమే లక్ష్యమని, డ్రైనేజీలను శుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని కమిషనర్ పేర్కొన్నారు. ఇకముందు కూడా ఇటువంటి ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతాయని తెలిపారు.

Scroll to Top