జాబ్ మేళాల ద్వారా యువతకు విస్తృత ఉద్యోగావకాశాలు – జిల్లా కలెక్టర్ రాజకుమారి

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 23 :

జిల్లాలో నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనంతరం, నంద్యాలలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మార్చి 25న నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ షాదీ ఖానాలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్, హెచ్‌క్యూహెచ్‌సీఎస్, యూనిసాఫ్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, డీపీ చాక్లెట్ ప్రైవేట్ లిమిటెడ్, టాటా రిడ్ ప్రైవేట్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్, చోళమండలం గోల్డ్ లోన్స్, టాటా ఎలక్ట్రానిక్స్, పుష్కల్ ఆగ్రోటెక్ లిమిటెడ్, డిక్సన్ టెక్నాలజీస్, జీపీఎస్ రెన్యువబుల్ ఎనర్జీ, అంబర్, వోల్టాస్ లిమిటెడ్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థల హెచ్‌ఆర్ ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.

పదవ తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, బి/డి/ఎం ఫార్మసీ మరియు పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాబ్ మేళా ద్వారా కనీసం 1500 ఉద్యోగాలను భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ఎక్సైజ్ చట్టం ప్రకారం పునరావాసం పొందుతున్న విద్యార్థులు కూడా జాబ్ మేళాలో పాల్గొనేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను సూచించారు. జాబ్ మేళాకు సంబంధించిన వివరాల కోసం 9182217075, 8297812530 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని, లేదా naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, డీఆర్ఓ రాము నాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తోగట ప్రియాంక, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ఉపాధి అధికారి కళ్యాణి, సెట్కూర్ సీఈఓ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top