

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 23 :
జిల్లాలో నిర్వహించనున్న జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ నెల 24, 25, 26 తేదీలలో మూడు రోజులపాటు జిల్లా స్థాయి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో జనగణన శిక్షణ కార్యక్రమంపై కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, శిక్షణ కార్యక్రమానికి సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరై, అందించే మార్గదర్శకాలను పూర్తిగా అవగాహన చేసుకోవాలని ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమం అయ్యలూరు మెట్టలోని ఎస్‌వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించబడుతుందని, ప్రతిరోజూ ఉదయం 9.00 గంటలకల్లా హాజరు కావాలని స్పష్టం చేశారు. అధికారులకు ఎటువంటి సెలవులు లేదా మినహాయింపులు అనుమతించబడవని తెలిపారు. జిల్లా కలెక్టర్ (ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్), జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సబ్ డివిజనల్ స్థాయి ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు, మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, డిప్యూటీ తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ శిక్షణకు హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం 164 మంది అధికారులను మూడు బ్యాచ్‌లుగా విభజించి, పూర్తి స్థాయి ఆన్‌లైన్ మరియు హ్యాండ్స్-ఆన్ విధానంలో శిక్షణ అందించనున్నట్లు కలెక్టర్ వివరించారు. ముఖ్యంగా సిఎంఎంఎస్ యాప్ ద్వారా ఎన్యుమరేటర్లకు ఆర్డర్లు జారీ చేయడం, బ్లాక్‌ల విభజన, డేటా నమోదు విధానం వంటి కీలక అంశాలపై రాష్ట్ర స్థాయి బృందం ప్రత్యక్షంగా శిక్షణ అందించనుందని కలెక్టర్ తెలిపారు. జనగణన వంటి జాతీయ ప్రాధాన్యత కలిగిన కార్యక్రమం విజయవంతం కావాలంటే అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, శిక్షణలో చురుకుగా పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
