ఘనంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు – జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 16 :

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా సోమవారం నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ ఆలోచనలకు ప్రేరణగా పనిచేసిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడని తెలిపారు. కుల, మత, వర్గ భేదాలు లేకుండా సమాజంలో సమానత్వం నెలకొల్పాలనే సంకల్పంతో ఆయన జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన 58 రోజుల పాటు అమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన విషయం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. ఆయన త్యాగం ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని గుర్తు చేశారు.

పొట్టి శ్రీరాములు త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటూ అమరావతిలో ఆయన 58 రోజుల నిరాహార దీక్షకు ప్రతీకగా 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. పొట్టి శ్రీరాములు గారి ఆశయాలు, త్యాగస్ఫూర్తి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచేలా జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

అనంతరం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాలలో డిఆర్ఓ రాము నాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, మునిసిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, నంద్యాల ఆర్డిఓ విశ్వనాథ్, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top