

ఉత్పాదన, సేవా రంగాల్లో 07 యూనిట్లకు రూ.34.30 లక్షల రాయితీలకు డీఐఈపీసీ కమిటీ ఆమోదం
జిల్లా స్థూల దేశీయోత్పత్తి పెంపుకు ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు కీలకం
కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌లో లక్ష్య సాధన దిశగా చర్యలు
- జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 04 :
సింగిల్ డెస్క్ విధానంలో పరిశ్రమల అనుమతులకు సంబంధించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సమర్పించే దరఖాస్తులను నిర్ణీత గడువులోపే పరిష్కరించి, జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపనకు సంపూర్ణ ప్రోత్సాహం అందించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ ఎస్. మహబూబ్ బాషా, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి, ఎల్డీఎం రవీంద్ర కుమార్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు తదితర వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 491 దరఖాస్తులు అందగా, సింగిల్ డెస్క్ విధానం ద్వారా 474 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 17 దరఖాస్తులను సంబంధిత శాఖలు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహంలో భాగంగా ప్రభుత్వ పథకాల ద్వారా పెట్టుబడి రాయితీ, పావలా వడ్డీ, విద్యుత్ చార్జీలపై సబ్సిడీ, సేల్స్ ట్యాక్స్ రాయితీలు వంటి ప్రయోజనాల కింద ఉత్పాదన మరియు సేవా రంగాలకు చెందిన 07 పరిశ్రమల యూనిట్లకు రూ.34.30 లక్షల రాయితీలను కమిటీ ఆమోదించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పిఎంఇజిపి) కింద జిల్లాలో 368 దరఖాస్తులు అందగా, వాటిలో 99 దరఖాస్తులకు రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెంపులో భాగంగా ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం (పిఎంఎఫ్ఎంఈ) కింద ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, మహిళా పొదుపు సంఘాలకు ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం వరకు, గరిష్టంగా రూ.10 లక్షల సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 52 దరఖాస్తులను బ్యాంకులకు పంపగా, 27 దరఖాస్తులకు రుణాలు మంజూరు కావడం జరుగుతోందన్నారు.
జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే స్థానిక ఆహార ఉత్పత్తులపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. అలాగే రోజా, జాస్మిన్ వంటి పూల సాగు విస్తృతంగా ఉన్న నేపథ్యంలో సుగంధ ద్రవ్యాల తయారీ కేంద్రాల ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎర్ర అటుకులు, నల్ల అటుకులు, మరమరాలు, మసాలా మరమరాలు, పచ్చిమిర్చి తొడిమ తీసే యూనిట్ల స్థాపనకు అవసరమైన చర్యలు చేపట్టాలని మెప్మా పీడీని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
