ఆదాయ పెంపులో జిల్లాను ముందంజలో నిలపాలి – జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 24 :

జిల్లాలో ప్రధాన ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించి, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత వార్షిక లక్ష్యాలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, రిజిస్ట్రేషన్, రవాణా తదితర విభాగాల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ రాము నాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తోగట ప్రియాంకతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఆదాయ వృద్ధి సాధించేందుకు ప్రతి శాఖ స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖకు వార్షికంగా రూ.1200 కోట్ల లక్ష్యం నిర్దేశించగా, ఇప్పటివరకు రూ.1159 కోట్ల ఆదాయం సాధించడం జరిగిందని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సుమారు 10 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించారు. మైనింగ్ శాఖకు రూ.247 కోట్ల లక్ష్యం నిర్దేశించగా, ఇప్పటివరకు రూ.231 కోట్ల ఆదాయం సమీకరించారని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖకు రూ.757.89 కోట్ల లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు రూ.584.27 కోట్ల మేర ఆదాయం వసూలు చేసినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో మిగిలిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అలాగే, జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో రూ.15 వేలకుపైగా వేతనం పొందుతున్న ఉద్యోగుల నుండి ప్రొఫెషనల్ టాక్స్ వసూలు చేయడానికి అవసరమైన వివరాలను సేకరించి సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారికి (డీఈఓ) కలెక్టర్ ఆదేశించారు. రిజిస్ట్రేషన్ శాఖకు రూ.201 కోట్ల లక్ష్యం నిర్దేశించగా, ఇప్పటివరకు రూ.183 కోట్ల ఆదాయం నమోదైందని తెలిపారు. రవాణా శాఖకు రూ.160.54 కోట్ల లక్ష్యం ఉండగా, ఇప్పటి వరకు రూ.117.33 కోట్ల ఆదాయం సమీకరించినట్లు చెప్పారు. అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేసి గత ఆర్థిక సంవత్సరాన్ని మించి లక్ష్యాలను అధిగమించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు…

జిల్లాలో విద్యుత్ ఉపకరణాల లభ్యతపై సమీక్ష :

జిల్లాలో గ్యాస్ కొరత లేదని పేర్కొంటూ ప్రత్యామ్నాయంగా వినియోగించే విద్యుత్ ఉపకరణాలు కూడా సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని విద్యుత్ దుకాణాల్లో ప్రస్తుతం 12 ఇండక్షన్ స్టవ్లు, 47 మైక్రో ఓవెన్లు, 97 రైస్ కుక్కర్లు, 24 ఎలక్ట్రిక్ ఓవెన్ టోస్టర్లు నిల్వలో ఉన్నాయని తెలిపారు. అవసరాన్ని బట్టి మరిన్ని ఉపకరణాలను సరఫరా చేయడానికి వ్యాపారులు సిద్ధంగా ఉన్నారని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వెల్లడించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

Scroll to Top