అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయం – అమరావతిలో 06 ఎకరాల విస్తీర్ణంలో 58 అడుగుల ఎత్తైన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేసి వారి సేవలను కూటమి ప్రభుత్వం ఘనంగా స్మరించుకుంటోంది – ఎన్ఎండి ఫిరోజ్


సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 16 :
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ గేట్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16న మద్రాసులో జన్మించారని తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారని, అనంతరం 1941–42 సంవత్సరాల్లో జరిగిన సత్యాగ్రహాలు మరియు క్విట్ ఇండియా మూవ్మెంట్ ఉద్యమాల్లో పాల్గొని పలుమార్లు జైలుశిక్ష అనుభవించారని పేర్కొన్నారు.
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన త్యాగ ఫలితంగానే 1953 నవంబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. ప్రజల కోసం తమ జీవితాలను అర్పించిన మహనీయులను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.అలాగే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అమరావతిలో 6 ఎకరాల విస్తీర్ణంలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేసి వారి సేవలను ఘనంగా స్మరించుకుంటున్నామని ఎన్ఎండి ఫిరోజ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ ఖండే శ్యాం సుందర్ లాల్, వైశ్య సంఘం అధ్యక్షులు బింగుమళ్ల శ్యాం సుందర్ గుప్తా, వైశ్య సంఘం నాయకులు సి.హరి, సుధాకర్, వడ్డే జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
