శాంతిరాం ఆస్పత్రిలో అరుదైన గుండె ఆపరేషన్ విజయవంతం-ఒకేరోజు ఇద్దరికి ‘రోటా’ చికిత్స

సత్యం వార్త / నంద్యాల /జనవరి 6 :
నంద్యాలలోని శాంతిరాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్డియాలజీ విభాగం అరుదైన ఘనత సాధించింది. గుండె రక్తనాళాల్లో తీవ్రమైన కాల్షియం అడ్డంకులతో బాధపడుతున్న ఇద్దరు రోగులకు అత్యంత క్లిష్టమైన ‘రోటా’ (రోటబ్లేషన్) ప్రక్రియను విజయవంతంగా నిర్వహించి ప్రాణదానం చేశారు. తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పెద్దా లింగమయ్య, బీకర్ బీ అనే ఇద్దరు రోగులు శాంతిరాం ఆస్పత్రిలో చేరారు. వీరి రక్తనాళాల్లో కాల్షియం పేరుకుపోయి రాయిలా గట్టిపడటంతో సాధారణ స్టెంటింగ్ ప్రక్రియ కష్టసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో, కార్డియాలజిస్టులు డాక్టర్ టి. నిశిత రెడ్డి, డాక్టర్ ఈ. నిఖిల్ ప్రవీణ్ ఆధ్వర్యంలోని వైద్య బృందం ఒకేరోజు వీరిద్దరికీ ‘రోటా’ ప్రొసీజర్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ “కాల్షియం వల్ల రాయిలా మారిన రక్తనాళాలను అత్యాధునిక రోటా టెక్నాలజీతో శుభ్రం చేసి, ఆపై స్టెంట్ వేయడం జరిగింది. సాధారణంగా ఇలాంటి క్లిష్టమైన ప్రక్రియలు మెట్రో నగరాల్లో మాత్రమే జరుగుతుంటాయి. కానీ, శాంతిరాం హాస్పిటల్‌లోని అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ వసతులతో నంద్యాలలోనే దీనిని విజయవంతంగా పూర్తి చేశాం,” అని వివరించారు.
ప్రస్తుతం రోగులిద్దరూ కోలుకున్నారని, వారు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ అరుదైన విజయం సాధించిన డాక్టర్ల బృందాన్ని శాంతిరాం హాస్పిటల్ యాజమాన్యం మరియు రోగుల బంధువులు ప్రత్యేకంగా అభినందించారు.

Scroll to Top