ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయిలో విజయవంతంగా అమలు కావాలి..చాబోలు గ్రామంలో 500 మందికి పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ..రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి

చాబోలు గ్రామంలో 500 మందికి పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ

రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో /జనవరి 5 :

భూ సంబంధిత సమస్యలను పరిష్కరించి రైతులకు రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. సోమవారం నంద్యాల రూరల్ మండలం చాబోలు గ్రామంలో మంత్రి జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ లతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా (పిఎం–అభిమ్) పథకం కింద గ్రామీణ ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు, మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పల్లె పండుగ–2.0లో భాగంగా ఏర్పాటు చేసిన మినీ గోకులాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమం ద్వారా రైతులు ఎదుర్కొంటున్న భూసంబంధిత సమస్యలను పరిష్కరించి, పూర్తి వివరాలతో రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను అర్హులైన రైతులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగానే చాబోలు గ్రామంలో 500 మందికి మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామన్నారు.  ఈ కార్యక్రమం ద్వారా రైతులకు భూమిపై పూర్తి హక్కు కల్పించడంతో పాటు భద్రత కూడా పెరిగిందన్నారు.  గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు కోసం సొంత స్థలాన్ని దానం చేసిన దాతను మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రజల సంక్షేమం కోసం వ్యక్తిగతంగా ముందుకొచ్చి భూమి దానం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధిలో విద్య, వైద్యం ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా అందాల్సిన మౌలిక అవసరాలేనని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యువత విద్యాభివృద్ధి వైపు దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ దిశగా గ్రామ సర్పంచ్ చొరవ తీసుకొని, యువతను విద్య వైపు ప్రోత్సహించాలని మంత్రి కోరారు.

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం భూసంబంధిత సమస్యలను పూర్తిస్థాయిలో తగ్గించాలనే ఉద్దేశంతో రీసర్వే ప్రక్రియను దశలవారీగా అమలు చేస్తోందన్నారు. గతంలో సర్వే, విస్తీర్ణం, ఆన్లైన్ అడంగల్, అన్నదమ్ములు-దాయాదుల మధ్య వివాదాలు రెవెన్యూ లేదా సివిల్ కోర్టుల ద్వారా మాత్రమే పరిష్కారం అయ్యేవని, వాటికి శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో రీసర్వే ఫేజ్–2, 3, 4లను ప్రారంభించామని తెలిపారు. ఫేజ్–4లో భాగంగా 30 గ్రామాలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. రీసర్వే పూర్తైన గ్రామాల్లో ప్రతి నెల 9వ తేదీలోపు ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. నంద్యాల జిల్లాకు ఇప్పటివరకు 52,091 పాసు పుస్తకాలు అందగా, అందులో నంద్యాల నియోజకవర్గానికి చెందిన 10,244 పాసు పుస్తకాలు ఉన్నాయని తెలిపారు. చాబోలు గ్రామంలో 500 మంది రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాసు పుస్తకాలలో ఏవైనా సమస్యలు ఉంటే మండల సర్వేయర్ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రజల అభ్యర్థన మేరకు ఇప్పటికే కొంత మేర పనులు పూర్తయ్యాయని, మిగిలిన రహదారులను కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కెసి కెనాల్ గ్రామం మధ్యలో వెళ్తున్న ప్రాంతంలో రోడ్డు లెవెలింగ్ అవసరమని కోరగా, ఇరిగేషన్ అధికారుల ద్వారా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అలాగే జంక్షన్ ప్రమాద జోన్‌గా ఉన్నందున ఎన్హెచ్–40 అధికారులతో చర్చించి తగిన భద్రతా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గ్రామంలో గ్రామీణ ఆరోగ్య ఉప కేంద్రం ఏర్పాటుకు ఆరు సెంట్ల భూమిని దానం చేసిన ముల్లా మొహమ్మద్ ఇలియాజ్‌ను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. గ్రామాల్లో స్వచ్ఛ గ్రామ సభలు నిర్వహిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని ప్రతి ఒక్కరూ పొందాలని గ్రామస్థులకు సూచించారు.

జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ మాట్లాడుతూ, మీ భూమి–మీ హక్కు కార్యక్రమం ద్వారా జిల్లాకు ఇప్పటివరకు 52,091 పట్టాదారు పాసు పుస్తకాలు అందగా, అందులో 16 వేల పాసు పుస్తకాలను ఇప్పటికే పంపిణీ చేసినట్లు తెలిపారు. కెసి కెనాల్ డిసి ఛైర్మన్ ఇలియాజ్ బాషా, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, రూరల్ తహశీల్దార్ శ్రీవాణి, చాబోలు గ్రామ సర్పంచ్ కడియం మౌనిక తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top