రెవెన్యూ క్లినిక్స్‌తో ప్రజలకు వేగవంతమైన పరిష్కారం..ఏడు రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 255 దరఖాస్తుల స్వీకరణ – జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

రెవెన్యూ క్లినిక్స్‌తో ప్రజలకు వేగవంతమైన పరిష్కారం

ఏడు రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 255 దరఖాస్తుల స్వీకరణ

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో /జనవరి 5 :

జిల్లాలో రెవెన్యూ సంబంధిత సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో కలెక్టరేట్ ఆవరణంలో రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏడు రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజల నుంచి మొత్తం 255 దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. సోమవారం నిర్వహించిన ఈ రెవెన్యూ క్లినిక్స్‌కు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, డిఆర్ఓ రాము నాయక్, రెవెన్యూ డివిజనల్ అధికారులు తదితరులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తును సంబంధిత రెవెన్యూ డెస్క్‌లలో నమోదు చేసి, నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

ప్రజలకు నేరుగా సేవలు అందిస్తూ రెవెన్యూ శాఖపై నమ్మకాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా సమస్యల పరిష్కారం పారదర్శకంగా, సమర్థవంతంగా జరుగుతోందని అన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ, గ్రామ, వార్డు సచివాలయ సేవలకు సంబంధించినవి-9, అడంగల్ సవరణలకు సంబంధించినవి-64, చుక్కల భూముల క్రమబద్ధీకరణ, 22-ఎ భూములకు సంబంధించినవి – 48, అసైన్డ్ భూములు, భూఆక్రమణలకు సంబంధించినవి-25,  రెవెన్యూ కోర్టు విచారణలు, ఆర్‌ఓఆర్‌కు సంబంధించినవి-30, సర్వే, రీ-సర్వేకు సంబంధించినవి-52, దేవాదాయ, వక్ఫ్ భూములకు సంబంధించినవి-27 దరఖాస్తులు ఉన్నాయన్నారు. స్వీకరించిన అన్ని సమస్యలను ప్రత్యేక శ్రద్ధతో త్వరితగతిన పరిష్కరిస్తామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి రెవెన్యూ క్లినిక్స్‌ను కొనసాగించి ప్రజలకు సత్వర న్యాయం అందిస్తామని కలెక్టర్ తెలిపారు.

Scroll to Top