
ముఖ్యమంత్రుల ‘ఏకాంత’ ఒప్పందాలతో సీమకు తీరని అన్యాయం..
వ్యక్తిగత ఒప్పందాలు కాదు.. వెనుకబడిన ప్రాంతాల జీవనాధారం ముఖ్యం..
రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమ ప్రాజెక్టుల బలి..
పోతిరెడ్డిపాడు నుంచి 120 టీఎంసీల తరలింపుపై సమగ్ర చర్చ జరగాలి.
ఇకనైనా రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై రాయలసీమ ప్రజాప్రతినిధులు స్పందించాలి.
సీమ ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి..
– బొజ్జా దశరథరామిరెడ్డి
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో /జనవరి 5 :
తెలంగాణ రాష్ట్రంలో అధికార పోరులో భాగంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం పోటీ పడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేయించడం అత్యంత దురదృష్టకరమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాజకీయ లబ్ధి పోరాటాల మధ్య రాయలసీమ దిక్కుతోచని స్థితిలోకి నెట్టబడుతోందని ఆయన అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం రాష్ట్ర అసెంబ్లీలో “చంద్రబాబు నాయుడు తో ఏకాంత సమావేశంలో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయించాను” అని చేసిన ప్రకటన నేపథ్యంలో సోమవారం నంద్యాల సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
గతంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ “బేసిన్లు లేవు, బేసజాలు లేవు… రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలి” అని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి వివరించినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. అదే సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తామే నిలిపివేయించామని టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు బహిరంగంగా ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రకటన రాజకీయ ప్రకంపనలకు దారి తీసిందన్నారు. సాగునీటి అంశాలపై రెండు రాష్ట్రాలు చర్చించాలంటే ముందుగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని చెప్పి దాని నిలుపుదల చేయించానని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని అన్నారు.
ఈ పరిణామాలను గమనిస్తే, ముఖ్యమంత్రులు పరస్పరం మాట్లాడుకునే అంశాలను వ్యక్తిగత ఒప్పందాల్లా నిర్వహిస్తున్నారన్న భావన కలుగుతోందన్నారు. అయితే వారు చర్చిస్తున్నవి రెండు వెనుకబడిన ప్రాంతాల జీవనాధారాలకు సంబంధించిన అంశాలని వారికి తెలియదని మేము భావించడం లేదన్నారు. ఈ విషయంలో సమాజం ముందు స్పష్టత ఉంచాల్సిన బాధ్యత ఉందని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన వాస్తవమా కాదా అనే విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పోతిరెడ్డిపాడు–బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ల నిర్మాణంలో అంజయ్య, ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. పోతిరెడ్డిపాడు–బనకచర్ల కాంప్లెక్స్ ద్వారా రోజుకు నాలుగు టీఎంసీల నీటిని తీసుకొని 30 రోజుల్లో 120 టీఎంసీల నీటిని తెలుగు గంగ, ఎస్సార్‌బీసీ, గాలేరు–నగరి, మైలవరం, పైడిపాలెం, చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్, మద్రాస్ త్రాగునీటి అవసరాలకు అందించేలా అప్పటి నాయకులు నిర్మాణాలు చేపట్టారని వివరించారు.
అయితే ఈ కాంప్లెక్స్ పూర్తయినప్పటికీ, ఇక్కడి నుంచి పై ప్రాజెక్టుల ద్వారా పొలాలకు నీరు అందించే అనుబంధ నిర్మాణాలను పూర్తి చేయకపోవడం వల్ల 30 రోజుల్లో 30 టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేసుకునే లేదా వినియోగించే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఈ లోపాలను సరిచేస్తే రాయలసీమకు విస్తృత ప్రయోజనాలు చేకూరుతాయని స్పష్టం చేశారు. చిన్న చిన్న అడ్డంకులు తొలగించి మిగిలిన నిర్మాణాలు పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ అంశాలను పక్కనపెట్టి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పరిమిత ప్రయోజనాలే ఉంటాయని అభిప్రాయపడ్డారు. అవసరమైన అనుబంధ నిర్మాణాలు లేకపోతే తరలించిన నీరు కుందూ నది ద్వారా వరదలుగా మారి నెల్లూరు వైపు సముద్రానికి చేరే ప్రమాదం ఉందన్నారు. అదేవిధంగా, రేవంత్ రెడ్డి సూచించినట్లుగా పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని ఆపి చంద్రబాబు నాయుడు గోదావరి–బనకచర్ల పథకాన్ని తీసుకొచ్చినా, మౌలిక వసతులు పూర్తికాకపోతే రాయలసీమ ప్రాజెక్టులకు నిలకడైన ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు–బనకచర్ల కాంప్లెక్స్ ద్వారా 30 రోజుల్లో 120 టీఎంసీల నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు అందించే కార్యాచరణపై, రాయలసీమ ఎత్తిపోతల పథకం, గోదావరి–బనకచర్ల అంశాలపై విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకోసం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రాయలసీమ ప్రాజెక్టుల కోసం పనిచేస్తున్న ప్రజాసంఘాలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించి, స్వేచ్ఛాయుతంగా చర్చ జరిగే వేదికను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. రాయలసీమ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, అధికార పార్టీ ఎవ్వరూ రాయలసీమ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కరువు నుంచి ప్రాంతాన్ని ఆదుకునే దిశగా స్పష్టమైన నిర్ణయాలు తీసుకునేందుకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని మరొక్కసారి విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు యర్రం శంకర్ రెడ్డి, బెక్కం చిన్న రామకృష్ణారెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, మహమ్మద్ పర్వేజ్, మహేశ్వరరెడ్డి, కొమ్మా శ్రీహరి, బిజ్జల కృష్ణమోహన్ రెడ్డి, పట్నం రాముడు, నిట్టూరు సుధాకర్ రావు, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
